ఎబిడిఎం “అభా” నంబర్ల ఏర్పాటులో ప్రత్యేకత చాటుకున్న ఏపీ
ఏపీ విజయాన్ని స్పెషల్ కేస్ స్టడీగా తీసుకోవాలని నేషనల్ హెల్త్ అథారిటీ,
ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ వెబ్సైట్ లో పేర్కొన్న కేంద్ర ప్రభుత్వం
ఏపీ అనుసరించిన అత్యుత్తమ, వినూత్న విధానాలు ఇతర రాష్ర్టాల కు మార్గదర్శకమని
పేర్కొన్న కేంద్రం
విజయవాడ : ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద డిజిటల్ హెల్త్ రికార్డులను(అభా
అకౌంట్ నంబర్లు) రూపొందించడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన
వినూత్నమైన, అత్యుత్తమమైన విధానాల్ని నేషనల్ హెల్త్ అథారిటీ ప్రశంసించిదని
వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.టి.కృష్ణ బాబు తెలిపారు. ఏపీ
ప్రభుత్వం సాధించిన విజయం ప్రత్యేకంగా పరిశీలించదగ్గ అంశంగా ఎన్ హెచ్ ఎ
పేర్కొందనీ , ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం చేసిన కృషిని అభినందించిందనీ అన్నారు.
ఏపీ విజయాన్ని స్పెషల్ కేస్ స్టడీగా తీసుకోవాలని నేషనల్ హెల్త్ అథారిటీ,
ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ వెబ్సైట్ లో కేంద్ర ప్రభుత్వం పేర్కొందనీ ,
ఏపీ అనుసరించిన విధానాలు ఇతర రాష్ర్టాల కు మార్గదర్శకమని కూడా వివరించిందనీ
ఆయన తెలిపారు. 14 అంకెలు గల ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ నంబర్లను(అభా)
జనరేట్ చేయడంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక శ్రద్ధను కనబర్చడాన్ని ఈ సందర్భంగా
ఎన్ హెచ్ ఎ ఉటంకించిందని కృష్ణ బాబు పేర్కొన్నారు. సుస్థిర అభివృద్ధి
లక్ష్యాలను సాధించే దిశగా విద్యా , వైద్య రంగాలకు ముఖ్యమంత్రి వైఎస్
జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రాధాన్యత నిస్తున్నారని , ప్రత్యేకించి వైద్య
ఆరోగ్య రంగంలో చేపట్టిన సంస్కరణల వల్లే ఇది సాధ్యపడిందన్నారు.
14-అంకెల ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ నంబర్లను రూపొందించడంలో ఏపీ వైద్య
ఆరోగ్య శాఖ అనుసరించిన అత్యుత్తమ, వినూత్న విధానాన్ని నేషనల్ హెల్త్ అథారిటీ
గుర్తించిందన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఈ గుర్తింపు ను పొందడంలో ముఖ్యమంత్రి
వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిచ్చిన ప్రోత్సాహం, నిరంతర పర్యవేక్షణ,
సమీక్షలు ఎంతగానో తోడ్పడ్డాయనీ , ఇందుకు గాను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని
ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణ బాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు. సుస్థిర
అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో ముఖ్యంగా వైద్య ఆరోగ్య రంగంలో లక్ష్యాల
విషయంలో సిఎంగారి దిశానిర్దేశం తోడ్పడిందన్నారు. అభా ఐడిలను రూపొందించడంలో
వైద్య ఆరోగ్య శాఖ కృషికి ,వినూత్న విధానానికీ ఎన్ హెచ్ ఎ గుర్తింపు లభించడంతో
పాటు పలు అవార్డుల్ని సాధించగలిగామని కృష్ణ బాబు తెలిపారు. ఇప్పటి వరకు దేశంలో
మొత్తం 44,01,00,234 అభా ఐడిలు రూపొందించగా , ఆంధ్రప్రదేశ్ 4,13,06,832 అభా
ఐడిలను విజయవంతంగా రూపొందించిందన్నారు. అభా నంబర్లను జారీలో జనాభా శాతం
పరంగా చూస్తే దేశంలోనే ఏపీలోనే అత్యధికమన్నారు. జనాభాలో దాదాపు 85% మందికి
అభా నంబర్ల ను ఏపీ రూపొందించిందన్నారు. ఎఎన్ ఎంలు, ఆశా వర్కర్లు , సిహెచ్వోలు
వంటి క్షేత్రస్థాయి ఆరోగ్య కార్యకర్తల సాయంతో ఒకే దశలో నాన్-కమ్యూనికేబుల్
డిసీజ్ (అసాంక్రమిక) సర్వేలో భాగంగా అభా నంబర్లను రూపొందించడంలో ఆంధ్రప్రదేశ్
రాష్ట్రం వినూత్న విధానాన్ని అవలంబించిందన్నారు. ఈ పద్ధతిలో ఇంటింటికీ సర్వే
నిర్వహించడం, తద్వారా అభా నంబర్లను రూపొందించడం, సర్వే చేయబడిన జనాభాకు
ప్రాథమిక ఆరోగ్య ప్రొఫైల్ను లింక్ చేయడం వంటి విధానాల్ని ఏపీ
అనుసరించిందన్నారు. ఏపీ అనుసరించిన అత్యుత్తమ, వినూత్న విధానాన్ని గుర్తించిన
నేషనల్ హెల్త్ అథారిటీ, ఎన్ హెచ్ ఎ- ఎబిడిఎం వెబ్సైట్లో స్పెషల్ కేస్
స్టడీగా తీసుకోవాలని సూచించిందన్నారు. అభా నంబర్లను రూపొందించడంలో ఏపీ
అనుసరించిన విధానాలు ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని వెబ్సైట్ లో
ఎన్ హెచ్ ఎ సూచించడం గమనించాల్సిన విషయమని కృష్ణబాబు తెలిపారు. ఆయుష్మాన్
భారత్ హెల్త్ అకౌంట్ (అభా)లో ప్రతి పౌరుడికీ 14 అంకెలున్న డిజిటల్ ఆరోగ్య
గుర్తింపు సంఖ్యను కేటాయిస్తారు. ఆ వ్యక్తి ఆరోగ్య సమాచారాన్నంతా దీనిలో
నిక్షిప్తం చేస్తారు. ఎప్పటికప్పుడు ఇది అప్ డేట్ అవుతూ వుంటుంది. ఓపి చీటీలు
, ఐపి వివరాలు, చేసిన టెస్టులు , డయగ్నోసిస్ వివరాలు, పాత చికిత్సలకు
సంబంధించిన ఫైళ్ల వంటి మోత బరువు లేకుండా దేశంలో ఎక్కడి నుండి అయినా ఒక్క
క్లిక్ తో ఆ వ్యక్తి ఆరోగ్య సమాచారాన్ని అందుబాటులోకి తెచ్చేందుకే కేంద్ర
ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఎబిడిఎం) ను ప్రవేశపెట్టింది.
పేపర్ రహిత సేవల్ని అందించేందుకు వీలుగా ఇ-హాస్పిటల్ విధానాన్ని కూడా అమలు
చేస్తోంది.
ఎబిడిఎం అమలులో మొదటి నుండీ ముందు వరసలో వుంటూ ఇతర రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్
ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. రాష్ట్రంలో 4.81 కోట్ల మందికి అభా రిజస్ట్రేషన్
లక్ష్యం కాగా, ఇప్పటి వరకూ 85 శాతం మందికి రిజిస్ట్రేషన్ ను వైద్య ఆరోగ్య శాఖ
పూర్తి చేసింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ , ప్రత్యేక ప్రధాన
కార్యదర్శి ఎం.టి.కృష్ణ బాబు నిరంతర సమీక్ష, పర్యవేక్షణ, ప్రోత్సాహంతో వైద్య
ఆరోగ్య శాఖ అధికారులు ఉత్సాహంగా పనిచేసి ఆశించిన లక్ష్యాన్ని చేరుకోగలిగారు.
దేశంలో నే ప్రథమ స్థానంలో నిలిచేందుకు కృషి చేస్తున్నారు. రాష్ట్రంలోని 14,368
ఆస్పత్రులు, 20,467 మంది వైద్య నిపుణులు, సిబ్బంది ఎబిడిఎంలో ముందుగా
నమోదుకావడం గమనార్హం. పిహెచ్ సి స్థాయి నుండి అన్ని స్థాయిల్లో ఇ-హెచ్ఆర్
విధానాన్ని ప్రవేశపెట్టి వైద్య ఆరోగ్య శాఖ ప్రజలకు డిజిటల్ వైద్య సేవల్ని
చేరువ చేస్తోంది. ఏపీ అనుసరిస్తున్న విధానాల్ని అమలు చేయాలని నేషనల్ హెల్త్
అథారిటీ దేశంలోని అన్ని రాష్ట్రాలకూ సూచించింది. ఇందులో భాగంగా మహారాష్ట్ర,
తమిళనాడు అధికారులు మన రాష్ట్రానికి వచ్చి ప్రభుత్వం అమలు చేస్తున్న
విధానాల్ని అధ్యయనం చేసి వెళ్లారు.