హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు
గుంటూరు : పశ్చిమ ఆఫ్రికాలోని నైగర్ లో ఇటీవల సైన్యం ఆ దేశ అధ్యక్షుడిపై
తిరుగుబాటు చేయడం విదితమే. ప్రస్తుతం విమాన రాకపోకలను ఆపేశారు. ఈ పరిణామాల
మధ్య శాంతి భద్రతలపై ఆందోళన నెలకొంది. అక్కడి పరిస్థితులను భారత ప్రభుత్వం
నిశితంగా పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ భారతీయులకు ముఖ్య
సూచనలు చేసింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అక్కడ ఉండాల్సిన అవసరం లేని
భారతీయులు త్వరగా దేశం వీడాలని సూచించింది. ప్రస్తుతం అక్కడి గగనతలాన్ని
(ఎయిర్ స్పేస్) మూసివేసిన విషయాన్ని దృష్టిలో ఉంచుకొని, భూ మార్గ సరిహద్దుల
ద్వారా వచ్చేటప్పుడు భద్రత గురించి అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
నైగర్కు వెళ్లాలని అనుకునే వారు కూడా అక్కడి పరిస్థితులు సాధారణ స్థాయికి
వచ్చే వరకు తమ ప్రయాణ ప్రణాళికలను పునఃపరిశీలించుకోవాలని సూచించారు. నైగర్
లో ఉన్న భారతీయులందరూ నియామీలోని భారత రాయబార కార్యాలయంలో నమోదు చేసుకొని
త్వరితగతిన భారతదేశం వచ్చేయాలని సూచించారు. భారతీయ పౌరులు సహాయం కోసం, నియామీ
లో ఉన్న భారత రాయబార కార్యాలయం ఏర్పాటు చేసిన నంబరు +227 9975 9975 ను
అత్యవసరంగా సంప్రదించగలరు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన తెలుగువారందరూ రాష్ట్ర
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏపీఎన్ ఆర్ టీ ఎస్ 24/7 హెల్ప్ లైన్ నంబర్లు +91
8500027678, 0863 2340678 ను సంప్రదించగలరు. అలాగే మీ కుటుంబసభ్యులు ఎవరైనా
నైగర్ లో ఉంటే ఈ నంబర్లను సంప్రదించి వివరాలు తెలపాలని కోరారు.