ఇద్దరు వ్యక్తులు కాల్పులకు తెగబడి పారిపోయినట్టు గుర్తించిన పోలీసులు
ఘటనలో ఒకరి మృతి, ఆరుగురికి తీవ్ర గాయాలు
నిందితుల కోసం గాలింపు
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. మిన్నెసొటా రాష్ట్రంలోని
మినియాపొలిస్ నగరంలో శుక్రవారం రాత్రి ఓ పంక్ రాక్ షోలో (మ్యూజిక్ షో)
కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒకరు మరణించగా ఆరుగురు తీవ్ర గాయాలపాలయ్యారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, ఇద్దరు వ్యక్తులు ఈ కాల్పులకు తెగబడ్డట్టు
తెలుస్తోంది. ఆ తరువాత వారు అక్కడి నుంచి పరిగెత్తుకుని వెళ్లిపోయారని
అధికారులు భావిస్తున్నారు. కాల్పుల్లో గాయపడ్డ వారు తమంతట తాముగా ఆసుపత్రికి
వెళ్లారు. మ్యూజిక్ షోలో పాల్గొన్న వారిని నిందితులు కావాలనే టార్గెట్
చేసుకుని ఉంటారని పోలీస్ చీఫ్ బ్రయన్ ఓ హారా మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ
ఘటనలో మృతి చెందిన వ్యక్తి ఎవరనేది పోలీసులు ఇంకా గుర్తించలేదు. ‘‘అప్పటివరకూ
అంతా బానే ఉంది. కానీ ఆ మరుక్షణమే కాల్పులు జరిగాయి. తూటాల నుంచి
తప్పించుకునేందుకు అందరూ నేలపై పడుకున్నారు’’ అని ఆ మ్యూజిక్ కార్యక్రమానికి
హాజరైన ప్రేక్షకుడు ఒకరు తెలిపారు. కాగా, నిందితుల కోసం పోలీసులు విస్తృత
గాలింపు చర్యలు చేపట్టారు.