మిగ్-21లతో పోలిస్తే మిగ్-29లు మరెంతో శక్తిమంతం
మిగ్-29లో ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు గ్రౌండ్ మిస్సైల్ సిస్టమ్
పాకిస్థాన్, చైనాకు గట్టి కౌంటర్ ఇచ్చేలా వ్యూహాత్మక శ్రీనగర్ ఎయిర్‌బేస్ వద్ద
అధునాతన మిగ్-29 విమానాలను భారత్ మోహరించింది. మిగ్-21 స్థానంలో వీటిని భర్తీ
చేసింది.
పొరుగు దేశాలు పాకిస్థాన్, చైనా నుంచి ముప్పును ఎదుర్కొనేందుకు భారత్
సరిహద్దులను మరింత పటిష్టం చేస్తోంది. ఇందులో భాగంగా జమ్మూకశ్మీర్‌లోని
వ్యూహాత్మక శ్రీనగర్ ఎయిర్‌బేస్ వద్ద.. అధునాతన మిగ్-29 యుద్ధ విమానాలను
మోహరించింది. ఇప్పటివరకు ఈ ఎయిర్‌బేస్‌లో ‘మిగ్-21’ స్క్వాడ్రన్ విధులు
నిర్వహించింది. ఇప్పుడు వాటి స్థానంలో మిగ్-29 యుద్ధ విమానాలను భారత వాయుసేన
దింపింది. ఈ మిగ్-9 స్క్వాడ్రన్‌ను ‘డిఫెండర్ ఆఫ్ ది నార్త్’గా పిలుస్తారు.
ఈ స్క్వాడ్రన్ చైనా, పాక్ నుంచి వచ్చే ముప్పును సమర్థంగా అడ్డుకోగలదని
వాయుసేన దళాలు చెబుతున్నాయి. ‘కశ్మీర్ లోయ మధ్యలో శ్రీనగర్ ఉంటుంది. మైదానాల
కంటే ఎత్తులో ఉంటుంది. సరిహద్దులకు సమీపంలో ఉండే ఎయిర్‌బేస్‌ల్లో వేగంగా
స్పందించే విమానాలను మోహరించడం ఉత్తమం. అవి దీర్ఘశ్రేణి క్షిపణులను
మోసుకెళ్లేవైతే మరింత వ్యూహాత్మకంగా ఉంటుంది. మిగ్-29కు ఈ సామర్థ్యాలన్నీ
ఉన్నాయి. రెండువైపులా ముప్పులను ఈ విమానాలు ఎదుర్కోగలవని భారత వాయుసేన పైలట్
స్క్వాడ్రన్ లీడర్ విపుల్ శర్మ వెల్లడించారు.