స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సీఎం స్టాలిన్
త్రిదళాల కవాతును వీక్షించిన ముఖ్యమంత్రి
చెన్నై : ఐక్యతతో సాధించిన స్వాతంత్య్రాన్ని ఐక్యంగా కాపాడదామంటూ ముఖ్యమంత్రి
స్టాలిన్ పిలుపునిచ్చారు. 77వ స్వాతంత్య్ర వేడుకలు సందర్భంగా సెయింట్
జార్జికోట బురుజుపై జాతీయ పతాకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించి గౌరవ వందనం
సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశాభివృద్ధిలో రాష్ట్రం కీలక పాత్ర
పోషిస్తుందన్నారు. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి శతజయంతి సంవత్సరంలో కోటలో జెండా
ఎగరవేయడం గర్వకారణమని పేర్కొన్నారు. ప్రజల ద్వారా ఎన్నికైన ముఖ్యమంత్రులందరూ
స్వాతంత్య్ర దినోత్సవం నాడు జెండా ఎగరవేసే హక్కును కల్పించి రాష్ట్ర
స్వయంప్రతిపత్తిని కరుణానిధి కాపాడారని పేర్కొన్నారు. అన్ని రంగాలు, అన్ని
వర్గాల ప్రజల అభివృద్ధి ధ్యేయంగా తమ సర్కారు కృషి చేస్తోందని పేర్కొన్నారు. తన
ప్రసంగంలో భాగంగా ముఖ్యమంత్రి పలు ప్రకటనలు చేశారు… ఓలా, ఊబర్, స్విగ్గి,
జొమాటో సిబ్బంది కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
మహిళా చోదకులు కొత్తగా ఆటో కొనుగోలు చేసేందుకు రూ.లక్ష సబ్సిడీ అందించే
పథకాన్ని మరో 500 మందికి, ట్రాన్స్జెండర్లకు విస్తరిస్తామని, కెథడ్రల్
రోడ్డులోని సెంగాంతళ్ పార్కు సమీపంలో 6.90 ఎకరాల్లో రూ.25 కోట్లతో కలైజ్ఞర్
శతాబ్ది పార్కు ఏర్పాటు చేస్తామని, ఈ ఏడాది పలు శాఖలకు చెందిన 55వేల
ఉద్యోగఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించారు.
పురస్కారాలు ప్రదానం : కార్యక్రమంలో భాగంగా పలువురికి పురస్కారాలు అందజేశారు.
‘తగైసాల్ తమిళర్’ పురస్కారాన్ని ద్రావిడర్ కళగం అధ్యక్షుడు వీరమణికి
అందించారు. పురస్కారంతో రూ.10లక్షల బ్యాంకు చెక్ కూడా అందించారు. ‘అబ్దుల్
కలాం’ పురస్కారాన్ని డాక్టర్ వసంతకు, ‘కల్పనా చావ్లా’ పురస్కారాన్ని
ముత్తమిళ్ సెల్వికి అందజేశారు. రాష్ట్రప్రభుత్వ సుపరిపాలన పురస్కారాలను
కడలూరు కలెక్టర్ అరుణ్ తంబురాజ్, కోవై ఎస్పీ బద్రీనారాయణన్, మద్రాస్
వైద్యకళాశాల డీన్ తేరణిరాజన్, కరూర్ కలెక్టరు ప్రభుశంకర్ తదితరులకు
ప్రదానంచేశారు. ముందుగా సచివాలయం ఉన్న రాజాజీ రోడ్డులో రాష్ట్ర ప్రభుత్వం
తరఫున స్వాతంత్య్ర దిన వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న
ముఖ్యమంత్రికి ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శివ్‌దాస్ మీనా పుష్పగుచ్ఛంతో
స్వాగతించారు. త్రిదళాల అధికారులను సాంప్రదాయబద్ధంగా ఆయనకు పరిచయంచేశారు.
తర్వాత త్రివిధ దళాలు, పోలీసుశాఖ కవాతు గౌరవ వందనాన్ని ముఖ్యమంత్రి
స్వీకరించారు.
అరబిందో 151వ జయంతి సందర్భంగా ఆయనకు గవర్నర్ ఆర్.ఎన్.రవి మంగళవారం నివాళి
అర్పించారు. గిండిలోని రాజ్‌భవన్ ప్రాంగణంలో అరబిందో చిత్రపటానికి పుష్పాంజలి
ఘటించారు. వెంట గవర్నర్ సతీమణి లక్ష్మి, సీనియర్ అధికారులు, రాజ్‌భవన్
ఉద్యోగులు ఉన్నారు. ముందుగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు.
గవర్నర్ ఆవిష్కరించి జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా సీఆర్పీఎఫ్ ఉద్యోగుల
గౌరవ వందనం స్వీకరించారు. స్వాతంత్య్ర సమరయోధుల వేషధారణతో పలువురు చిన్నారులు
ఆకట్టుకున్నారు.
విద్యార్థులతో భవిష్యత్తుతో ఆడుకోవద్దని పుదుచ్చేరి ఇన్ఛార్జ్ ఎల్జీ తమిళిసై
సౌందరరాజన్ తెలిపారు. పుదుచ్చేరి సాంకేతిక వర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమంలో
ఆమె పాల్గొని విద్యార్థులకు పట్టా అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ దేశం వందో
స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకునే నాటికి ఆర్థికాభివృద్ధి చెంది ఉంటుందన్నారు.
అదేవిధంగా పుదుచ్చేరి ఆదర్శవంతమైన రాష్ట్రంగా మారి ఉంటుందని తెలిపారు. నీట్
ద్వారా రాజకీయాలు చేస్తున్నారని తెలిపారు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పుదుచ్చేరి సముద్రతీర రోడ్డులో ముఖ్యమంత్రి
రంగసామి జాతీయజెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
పెరియకాలాపట్టిలో రూ.20కోట్ల ఖర్చుతో, నల్లవాడిల్లో రూ.19 కోట్లతో ఫిష్
ల్యాండింగ్ సైట్‌ని, తెంగాయ్తిట్టు చేపల హార్బర్‌ని రూ.54 కోట్ల ఖర్చుతో
విస్తరించేందుకు కేంద్రప్రభుత్వం నుంచి అనుమతి కోరినట్లు తెలిపారు. త్వరలో ఆ
పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. తట్టాంజావడిలో రూ.528 కోట్లతో శాసనసభ
ప్రాంగణం, కాలాపట్టిలో రూ.438 కోట్లతో జాతీయ న్యాయ వర్సిటీ నిర్మించనున్నట్లు
తెలిపారు. పాండి మెరినా సముద్రతీరంలో రూ.14కోట్ల ఖర్చుతో సముద్రపునీరు
తాగునీటిగా మార్చే ప్రాజెక్ట్‌ని అమలుచేయనున్నట్లు చెప్పారు.