దర్శి బాధిత కుటుంబానికి పరామర్శ
ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు
విజయవాడ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్శి దళిత యువతి మౌనిక పై
జరిగిన అమానుష దాడి ఘటనలో బాధితులకు సత్వర న్యాయం జరిగి, నిందితులకు కఠిన
శిక్ష పడాలంటే వెంటనే ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏర్పాటు చేయాలని ఏపీసీసీ
అధ్యక్షులు గిడుగు రుద్రరాజు డిమాండ్ చేశారు. దర్శి మండలం, బొట్లపాలెం
గ్రామంలోని బాధిత యువతి మౌనిక తల్లి అయిన అనురాధను గురువారం పీసీసీ అధ్యక్షులు
గిడుగు రుద్రరాజు, కార్యనిర్వాహక అధ్యక్షులు మస్తాన్ వలి, పలువురు సీనియర్
కాంగ్రెస్ నాయకులు పరామర్శించారు. ఆమెకు ధైర్యం చెప్పి, కాంగ్రెస్ పార్టీ
అన్ని విధాలా అండగా ఉంటుందని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా
పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ, నిందితులపై నేషనల్ ఎస్సి
కమిషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ తో పాటు విమెన్&చైల్డ్ ప్రొటెక్షన్ నేషనల్
కౌన్సిల్ లో ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ
దళితులు, మైనారిటీలు, బడుగుల పక్షాన ఉంటుందని ఆయన తెలిపారు.
ముఖ్యమంత్రి నైతిక బాధ్యతతో స్పందించాలి : రాష్ట్రంలో శాంతి, భద్రతను
ప్రశ్నర్థకం చేస్తోన్న దర్శి దళిత యువతిపై జరిగిన దాడి ఘటనపై రాష్ట్ర
ముఖ్యమంత్రి జగన్ నైతిక బాధ్యతతో వెంటనే స్పందించాలని పీసీసీ అధ్యక్షులు
గిడుగు రుద్రరాజు డిమాండ్ చేశారు. రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా జరిగిన ఈ
ఘటనపై మహిళా హోం మంత్రి కూడా సామాజిక బాధ్యతతో వ్యవరించాలని కోరారు. బాధిత
కుటుంబ సభ్యులు తమ ప్రాణాలకు ముప్పు ఉందని భయాందోళనలు వ్యక్తం చేస్తోన్న
నేపద్యంలో ప్రభుత్వం సత్వరమే స్పందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రస్తుత
పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున బాధిత కుటుంబానికి న్యాయ సహాయంతో పాటు
అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని రుద్రరాజు పేర్కొన్నారు. కార్యక్రమంలో
సీనియర్ నేతలు సుధాకర్ రెడ్డి, సైదా, కొండారెడ్డి, డీసీసీ అధ్యక్షులు
అలెగ్జాండర్ పలువురు నాయకులు పాల్గొన్నారు.