బీజింగ్ : కార్చిచ్చులు పలుదేశాలను హడలెత్తిస్తున్నాయి. అమెరికాతోపాటు కెనడా,
గ్రీస్, స్పెయిన్‌లోని టెనెరైఫ్ ఐలాండ్‌ను కార్చిచ్చులు వణికిస్తున్నాయి.
వేలాది మంది స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. హవాయిలో
కార్చిచ్చు ధాటికి శుక్రవారం నాటికి 114 మంది దుర్మరణం చెందారు. 2200 భవనాలు
ధ్వంసమయ్యాయని, మరో 500 నిర్మాణాలు దెబ్బ తిన్నాయని హవాయి గవర్నర్ జోష్
గ్రీన్ వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సోమవారం మౌలో
పర్యటించనున్నారు. మరోవైపు దావానలం వాషింగ్టన్ రాష్ర్టానికీ వ్యాపించిందని,
ఒక వ్యక్తి చనిపోయాడని అధికారులు తెలిపారు. దక్షిణ కాలిఫోర్నియాలో తీవ్రమైన
సుడిగాలులు(హరికేన్లు) కార్చిచ్చులు మరింత వేగంగా వ్యాపించడానికి
కారణమవుతున్నాయి.
35 వేలమంది తరలింపు : కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లో ఏర్పడిన
కార్చిచ్చును ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించింది. 35 వేల మందిని సురక్షిత
ప్రాంతాలకు తరలించింది. ప్రావిన్స్ ప్రీమియర్ డేనియల్ మాట్లాడుతూ మరో 30
వేల మందిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.టర్కీ సరిహద్దులోని
గ్రామాల్లో వేసవి కార్చిచ్చు రెండో రోజైన ఆదివారమూ చెలరేగింది. దీంతోఅధికారులు
మరో నాలుగు గ్రామాల ప్రజలను ఖాళీ చేయించారు.