చంద్రయాన్లతో లాభాలు ఎన్నో
అంతరిక్షంలో భారత్‌ది అద్వితీయ పాత్ర
నాసా-ఇస్రో బంధం మరింత బలోపేతం
ప్రముఖ భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త భవ్యా లాల్
నాసా, ఇస్రో వచ్చే ఏడాది ఉమ్మడిగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కు
యాత్ర చేపట్టనున్నాయి. అర్టెమిస్ కార్యక్రమం కింద అవి సంయుక్తంగా అద్భుత
ప్రయోగాలు చేస్తాయని నాకు నమ్మకం ఉందని నాసాలో కీలక బాధ్యతలు నిర్వహించిన
భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త డాక్టర్ భవ్యా లాల్ వివరించారు.
నాసా, ఇస్రో వచ్చే ఏడాది ఉమ్మడిగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కు
యాత్ర చేపట్టనున్నాయి. అర్టెమిస్ కార్యక్రమం కింద అవి సంయుక్తంగా అద్భుత
ప్రయోగాలు చేస్తాయని నాకు నమ్మకం ఉంది. దాదాపు 50 ఏళ్ల కిందే జాబిల్లిపై జెండా
పాతినా.. అది బుడిబుడి అడుగే! తర్వాత అనేక మంది వ్యోమగాములు వెళ్లి వచ్చినా
చందమామపై అడుగుపెట్టి రావటానికే సరిపోయింది. సాంకేతికత విస్తరించిన వేళ…
మానవాళి మరోమారు చంద్రుడి వైపు తాజాగా దృష్టిసారిస్తోంది. సరికొత్త
ఆవిష్కరణలను లక్షిస్తోంది. చందమామ రావే అనకుండా మేమే వస్తున్నాం అంటూ భారత్
సహా కీలకదేశాలన్నీ చంద్రయానాలకే కాదు… అక్కడ నివాసాల ఏర్పాటుకూ
సిద్ధమవుతున్నాయి. అమెరికా అందరికంటే ఓ అడుగు ముందుకేసి ఏకంగా ‘మామ ఇంట్లో’
విద్యుత్ ఉత్పత్తికి, రోడ్లు-ఇళ్ల నిర్మాణాలకు కూడా ప్రణాళికలు వేస్తోంది.
రాబోయే కాలంలో అంతరిక్ష పరిశోధనలకు చందమామ ఎలా కీలకం కాబోతున్నాడు? మానవాళి ఏం
సాధించాలనుకుంటోంది. భారత్‌తో అమెరికా అంతరిక్ష బంధం ఎలా ఉండబోతోంది. తదితర
ఆసక్తికర అంశాలను నాసాలో కీలక బాధ్యతలు నిర్వహించిన భారతీయ అమెరికన్
శాస్త్రవేత్త డాక్టర్ భవ్యా లాల్ తాజాగా వివరించారు. బైడెన్ ప్రభుత్వ
యంత్రాంగంలో అంతరిక్ష విధాన నిర్ణయాల్లో ఆమె కీలక పాత్ర పోషించారు. జాబిల్లితో
పాటు అంగారకుడు, తోకచుక్కలు, గ్రహశకలాలపై ఉమ్మడి పరిశోధనలకు ఉద్దేశించిన
‘అర్టెమిస్ ఒప్పందం’లోకి భారత్‌ను ఆహ్వానించడంలో ముఖ్య భూమిక వహించిన భవ్యతో
ప్రత్యేక ముఖాముఖి ముఖ్యాంశాలు.
అంతరిక్ష రంగంలో భారత్, అమెరికా ఒకప్పుడు అంతగా సహకరించుకోలేదు! కానీ
ఆర్టెమిస్ ఒప్పందంతో భవిష్యత్తులో పరిస్థితి మారిపోనుందంటున్నారు ప్రముఖ
భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త భవ్యా లాల్. నాసా, ఇస్రో సంయుక్తంగా పనిచేస్తే
ఇరు దేశాలు ఎలా ప్రయోజనం పొందొచ్చు.. అంతర్జాతీయ సమాజానికి ఎలా దోహదపడొచ్చు..
అనే వివరాలు సహా అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించిన పలు ఆసక్తికర అంశాలను
ముఖాముఖిలో ఆమె పంచుకున్నారు.
భారత్ ప్రయోగించిన చంద్రయాన్-3 వ్యోమనౌక చంద్రుడిపై ల్యాండయ్యేందుకు
సిద్ధమవుతోంది. ఇప్పటికే ఎన్నో జాబిల్లి యాత్రలు చేసిన అమెరికా దీన్నెలా
చూస్తోంది?
గతంలో ఎన్ని యాత్రలు చేసినా చంద్రుడింకా నిగూఢమే! మనకు అత్యంత సమీప ఖగోళ
వస్తువైన ఇది భూమి నుంచే ఏర్పడిందన్నది నిపుణుల అంచనా. అందువల్ల తొలినాటి
భూమికి సంబంధించిన వివరాలు అక్కడ నిక్షిప్తమై ఉంటాయి. పుడమిపై ఆ వివరాలన్నీ
చెరిగిపోయాయి. చంద్రుడి గురించి అర్థం చేసుకోవడం ద్వారా తొలినాటి భూమి గురించి
కొత్త విషయాలు తెలుస్తాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను పరీక్షించడానికీ
జాబిల్లి ఒక అద్భుత వేదిక. భవిష్యత్‌లో చేపట్టబోయే సుదూర అంతరిక్ష యాత్రలకు
దాన్ని మజిలీగా ఉపయోగించుకోవచ్చు. చందమామపై విజయవంతంగా పాగా వేయడం ద్వారా
పుడమిపై జీవనాన్ని మెరుగుపరచుకోవచ్చు. చంద్రుడి ఉపరితలాన్ని, ఆ ఖగోళ వస్తువుపై
గ్రహశకలాలు, ఉల్కల ఢీ చరిత్ర తెలుసుకోవడం ద్వారా భవిష్యత్‌లో భూమిపై అంతరిక్ష
శిలల దాడి నుంచి రక్షించుకోవడానికి మార్గాలను శోధించొచ్చు. చంద్రయాన్ యాత్రల
ద్వారా జాబిల్లికి సంబంధించి విలువైన సమాచారం వెలుగులోకి వస్తోంది. దానిపై
నీటి రేణువుల ఆచూకీని చంద్రయాన్-1 ఆర్బిటర్ కనుగొంది.
అర శతాబ్దం కిందటే చందమామపై 12 మంది వ్యోమగాములు కాలు మోపారు. ఇప్పుడు మళ్లీ
దానిపైకి మానవ సహిత యాత్రల గురించి విస్తృతంగా ఆలోచించాల్సిన అవసరం ఏమొచ్చింది?
ఇందుకు కొన్ని కారణాలు ఉన్నాయి. భూమి తొలినాటి చరిత్ర, పరిణామక్రమం గురించి
ఎన్నో విషయాలను తెలుసుకోవడంతో పాటు సాంకేతిక పురోగతికి జాబిల్లి యాత్రలు
ఉపయోగపడతాయి. ప్రొపల్షన్, కమ్యూనికేషన్, నేవిగేషన్, రోబోటిక్స్, మానవ
ఆరోగ్యం వంటి రంగాల్లో సాంకేతిక ఆవిష్కరణలకూ వీలు కలిగిస్తాయి. పరిశ్రమలకూ
వీటివల్ల ఊతం లభిస్తుంది. ఉదాహరణకు.. 1960లు, 70ల్లో చంద్రుడిపైకి మానవసహిత
అంతరిక్ష యాత్రల కోసం చేపట్టిన అపోలో ప్రాజెక్టు వల్ల కంప్యూటింగ్, సోలార్
సెల్స్ పరిశ్రమ పురుడుపోసుకుంది. 1963లో ఒక్కో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్
(ఐసీ)ను నాసా వెయ్యి డాలర్ల చొప్పున కొనుగోలు చేసింది. అపోలో యాత్రల కోసం ఆ
సంస్థ ఇచ్చిన ఆర్డర్ల వల్ల ఉత్పత్తి భారీగా పెరిగి.. 1969 నాటికి ఒక్కో ఐసీ ధర
1.58 డాలర్లకు దిగి వచ్చింది. చంద్రుడిపై హిమం రూపంలో నీరు వంటి విలువైన
వనరులు ఉన్నట్లు అంచనా. అవి జీవుల మనుగడకు తోడ్పాటు ఇవ్వడమే కాకుండా
ఆక్సిజన్, తాగునీరు, హైడ్రోజన్లాంటి రాకెట్ ఇంధనం వంటివి ఉత్పత్తి
చేయడానికి వీలు కలిగిస్తాయి. వీటితో సుస్థిర, చౌకైన పద్ధతిలో ఖగోళాన్వేషణలు
చేయవచ్చు.
చందమామపై నివాసానికి అవసరమైన వనరులు ఎక్కడి నుంచి వస్తాయి?
అపోలో ప్రాజెక్టులో భాగంగా వ్యోమగాములు చందమామపై జెండా పాతి, భూమికి
తిరిగొచ్చేశారు. అర్టెమిస్ ప్రాజెక్టు కింద దీర్ఘకాలం పాటు వ్యోమగాములను
అక్కడ ఉంచుతాం. సంబంధిత ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. భూమికి వెలుపల మానవులు
జీవించడానికి తోడ్పడే విధానాలపై పరిశోధనలకు నాసా ఊతమిస్తోంది. ఉదాహరణకు..
చంద్రుడి ఉపరితలంపై కిలోమీటరు పొడవున విద్యుత్ వైర్లను రోబోల సాయంతో
వేయడానికి ఆస్ట్రోబోటిక్ అనే కంపెనీతో నాసా ఒప్పందం కుదుర్చుకుంది. దీనివల్ల
అక్కడ విద్యుదుత్పత్తి, పంపిణీ, హైవోల్టేజ్ పవర్ కన్వర్టర్ వంటివి సిద్ధం
చేయవచ్చు. చంద్రుడి ఉపరితలం నుంచి ఆక్సిజన్, ఇనుము, సిలికాన్, అల్యూమినియం
వెలికితీసి, వాటి నుంచి సోలార్ సెల్స్, వైర్ ఉత్పత్తి చేయడానికి బ్లూ
ఆరిజిన్ కంపెనీని నాసా ఎంపిక చేసింది. జాబిల్లిపై శిలలను తొలగించడానికి,
ఒదులుగా ఉండే చంద్రుడి మట్టిని గట్టిగా చేయడానికి, దాన్ని కరిగించి ఘన
ఉపరితలంగా మార్చడానికి గ్రేడర్, కంపాక్టర్, మైక్రోవేవ్ ఎమిటర్ అనే సాధనాల
అభివృద్ధి బాధ్యతలను రెడ్వైర్ అనే సంస్థకు అప్పగించాం. వీటి సాయంతో ధూళికి
తావులేని ప్రదేశాలతో పాటు చంద్రుడిపై కట్టే ఇళ్లకు పునాదులు, రోడ్లు,
ల్యాండింగ్ ప్యాడ్లను సిద్ధం చేయవచ్చు. ప్లుటోనియం ఆధారిత విద్యుదుత్పత్తి
వ్యవస్థకు ప్రత్యామ్నాయ సాధనాల కోసం దీర్ఘకాలం మన్నే, వెలుపలి ఉష్ణోగ్రతలతో
సంబంధం లేకుండా స్థిరంగా కొనసాగే రేడియో ఐసోటోపిక్ విద్యుత్ వ్యవస్థను
అభివృద్ధి చేయడానికి జెనో పవర్ సిస్టమ్స్‌ను ఎంపిక చేశాం.
భారత్-అమెరికా మధ్య అంతరిక్ష సహకారం విషయంలో ఒకప్పుడు సఖ్యత లేదు.
భవిష్యత్‌లో ఈ మైత్రి ఎలా రూపాంతరం చెందబోతోంది?
మునుముందు రెండు దేశాల మైత్రి మరింత విస్తరిస్తుంది. భారత్-అమెరికా పౌర
అంతరిక్ష ఉమ్మడి కార్యాచరణ బృందం (సీఎస్జేడబ్ల్యూజీ) వంటి ద్వైపాక్షిక
వేదికలు, క్వాడ్ వంటి బహుళపక్ష సహకార వేదికల ద్వారా రెండు దేశాల మధ్య
భాగస్వామ్యాలు మరింత బలపడనున్నాయి. రెండు దేశాల ప్రయోజనాలు, సామర్థ్యాల పరంగా
ఉన్న వైరుధ్యాలను చెరిపేసి.. వ్యూహాత్మకంగా ఒక్కతాటిపైకి తీసుకురావాలి. రెండు
దేశాల లక్ష్యం ఇదే. నాసా, ఇస్రోలు సంయుక్తంగా చేపట్టిన నిసార్ (నాసా-ఇస్రో
సింథటిక్ అపెర్చర్ రాడార్) రెండు దేశాల భాగస్వామ్యం ఇందుకు నిదర్శనం.
దీన్ని వచ్చే ఏడాది శ్రీహరికోట నుంచి ప్రయోగించనున్నారు. నిసార్ తర్వాత మరింత
ఉత్తేజభరిత ప్రాజెక్టులను ఉమ్మడిగా చేపట్టే వీలుంది. దీనిపై చర్చించడానికి
ఇస్రో ఛైర్మన్ అమెరికాలో పర్యటించారు. ఈ చర్చలను కొనసాగించడానికి నాసా అధిపతి
త్వరలో భారత్‌ను సందర్శిస్తారు. అర్టెమిస్ కార్యక్రమం కింద ఈ రెండు అంతరిక్ష
సంస్థలు సంయుక్తంగా అద్భుత ప్రయోగాలు చేపడతాయని నాకు నమ్మకం ఉంది. ప్రస్తుతం
నాసా, ఇస్రో మధ్యే ప్రధాన మైత్రి భాగస్వామ్యాలు నడుస్తున్నాయి. భవిష్యత్‌లో
ప్రైవేటు పరిశ్రమలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకూ అది విస్తరిస్తుందని
భావిస్తున్నా.
ఇటీవల అమెరికా నేతృత్వంలోని అర్టెమిస్ ఒప్పందంలో భారత్ చేరింది. ఇందులో మీరు
కీలక పాత్ర పోషించారు. ఒప్పందం ముఖ్య ఉద్దేశమేంటి?
చంద్రుడిపైకి మానవులను తిరిగి తీసుకెళ్లడానికి, కొత్త శాస్త్రీయ ఆవిష్కరణలు
చేపట్టడానికి ఉద్దేశించిన అర్టెమిస్ కార్యక్రమానికి నాసా నేతృత్వం
వహిస్తోంది. ఈ క్రతువులో అనేక దేశాలు, ప్రైవేటు కంపెనీలు.. అమెరికాతో
భాగస్వామ్యంతో గానీ, స్వతంత్రంగా గానీ చందమామ వద్ద కార్యకలాపాలు సాగిస్తాయి.
అర్టెమిస్ ఒప్పందం విషయానికొస్తే.. 1967 నాటి ఔటర్ స్పేస్ ఒప్పందానికి
వెలుపల పౌర అంతరిక్ష పరిశోధనలకు మార్గనిర్దేశం చేయడానికి ఉమ్మడి సూత్రాలు
అవసరమని అమెరికా గుర్తించింది. 21వ శతాబ్దంలో ఖగోళ పరిశోధనలకు కొన్ని
సూత్రాలను తెరపైకి తెచ్చింది. వీటిని అర్టెమిస్ ఒప్పందం (అర్టెమిస్
అకార్డ్స్)గా పిలుస్తున్నాం. దీనిపై పలు దేశాలు సంతకాలు చేశాయి. ఇది
సురక్షితమైన, బాధ్యతాయుతమైన ఖగోళ పరిశోధనల విషయంలో భాగస్వామ్య పక్షాల మధ్య
అవగాహనకు ఉద్దేశించింది. అందరికీ ప్రయోజనకరం. జాబిల్లితోపాటు అంగారకుడు,
తోకచుక్కలు, గ్రహశకలాలపై ఉమ్మడి పరిశోధనలకు దోహదపడుతుంది.
అర్టెమిస్ ఒప్పందంపై సంతకం చేయడం ద్వారా భారత్ తానొక బాధ్యతాయుత అంతరిక్ష
శక్తినని చాటుకుంది. అంతరిక్షాన్ని శాంతియుత అవసరాలకు వినియోగిస్తామని స్పష్టం
చేసినట్లయింది. దీనివల్ల కచ్చితంగా దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయి. ఒప్పందంలో
ఉన్న ఇతర దేశాలతో భాగస్వామ్యం ద్వారా భారత్ తన వనరులను నిర్దిష్ట అంశాలపై
కేంద్రీకరించొచ్చు. మరింత సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందొచ్చు. అంతరిక్ష వనరులను
వినియోగించుకోవచ్చు. కొత్త మార్కెట్లతో సంధానం ఏర్పడుతుంది. చంద్రుడిపై
మైనింగ్ దిశగా ప్రైవేటు సంస్థలకు మార్గం సుగమమవుతుంది. అందువల్ల భారత్
వాణిజ్య అవకాశాలను పెంచుకోవచ్చు.