న్యూయార్క్ : మరోసారి అమెరికా పాలనా పగ్గాలు అందుకునేందుకు పోటీపడుతున్న ఆ
దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్…భారత్‌పై అక్కసు వెళ్లగక్కారు.
కొన్ని అమెరికా ఉత్పత్తులపై భారత్ మరీ అధికంగా పన్నులు విధిస్తోందని
విమర్శించారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే భారతీయ ఎగుమతులపై అధిక
పన్నులు విధిస్తానని ఒక టీవీ ఇంటర్వ్యూలో ప్రకటించారు. అధ్యక్ష ఎన్నికలకు
రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న వారిలో ప్రస్తుతం
అందరికన్నా ముందున్న ట్రంప్…క్రితంసారి దేశాధ్యక్షుడిగా ఉన్నప్పుడు
భారత్‌ను సుంకాల రాజాగా వర్ణించారు. అమెరికా మార్కెట్లో సుంకాలు లేకుండా
కొన్ని ఉత్పత్తులను అమ్ముకోవడానికి భారత్‌కు ఇచ్చిన ప్రాధాన్య హోదాను 2019 మే
నెలలో రద్దు చేశారు. తాజాగా ఫాక్స్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మళ్లీ ఇదే
అంశాన్ని లేవనెత్తారు. హ్యార్లీ డేవిడ్సన్ వంటి అమెరికన్ మోటారు సైకిళ్లను,
ఇతర ఉత్పత్తులను భారత్‌లో విక్రయించాలంటే 100 నుంచి 200 శాతం సుంకం
చెల్లించాల్సి వస్తోందనీ, అదే అమెరికాలో భారతీయ ఉత్పత్తులపై అసలు పన్నే లేదని
ట్రంప్ వాదించారు.
డొనాల్డ్ పిడివాదం : అమెరికా అధ్యక్ష ఎన్నికలో రిపబ్లికన్ పార్టీ
అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్న వారితో బుధవారం ఫాక్స్ న్యూస్ నిర్వహించే
టీవీ చర్చలో తాను పాల్గొనబోనని డొనాల్డ్ ట్రంప్ (77) ప్రకటించారు. బుధవారమే
కాదు ఆపైన జరిగే చర్చల్లోనూ పాల్గొనేది లేదని స్పష్టం చేశారు. రిపబ్లికన్
పార్టీ ఓటర్లుగా నమోదైన వారు, తమ పార్టీ తరఫున దేశాధ్యక్ష పదవికి అంతిమ
అభ్యర్థి ఎవరో తేల్చడానికి ప్రైమరీ ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా
రిపబ్లికన్ అభ్యర్థులు టీవీ చర్చల్లో పాల్గొని ఎదుటివారి విధానాలకన్నా తమ
విధానాలు ఎలా గొప్పవో వివరిస్తారు. రిపబ్లికన్ ఓటర్ల మనోగతం తెలిపే వివిధ
సర్వేలలో ట్రంప్ అందరికన్నా ముందున్నట్లు తేలింది.