జిల్లాలో ఆక్వా, నాన్ ఆక్వా సాగు సర్వే పకడ్బందీగా నిర్వహించాలి
కృష్ణా జిల్లా కలెక్టర్ పి రాజాబాబు
మచిలీపట్నం : కృష్ణా జిల్లా కలెక్టర్ పి రాజాబాబు మంగళవారం కలెక్టరేట్లో
మత్స్యశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఆక్వా సాగు, నాన్ ఆక్వా
సాగు వివరాలు నమోదుకు చేపట్టిన సమగ్ర సర్వే పై సమీక్షించారు. ఈ సందర్భంగా
కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఆక్వా, నాన్ ఆక్వా జోన్ లను గుర్తించుటకు
చేపట్టిన సమగ్ర సర్వే పూర్తికావచ్చిందని అన్నారు. ఈ సర్వేలో ఆక్వా సాగు
చేస్తున్న భూముల వివరాలు నమోదు చేయడంతో పాటు, ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని
ఆక్వా సాగుతో ఎంజాయ్ చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న వారిని
గుర్తించాలన్నారు. అట్టివారి నుండి రెవిన్యూ పరంగా వార్షిక లీజు వసూలు చేయడం
ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. పట్టా
భూముల్లో అనుమతులు లేకుండా ఆక్వా సాగు చేస్తున్న వారిని గుర్తించి, ఆయా
ప్రాంతంలో అర్హత మేరకు అనుమతులు పొందేలా, ప్రభుత్వానికి ఫీజులు చెల్లించేలా
చూడాలన్నారు. ఈ సమావేశంలో మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ ఎన్ శ్రీనివాసరావు,
మత్స్యశాఖ ఏడీలు వెంకటేశ్వర రెడ్డి, నాగబాబు, ఆర్ ప్రతిభ తదితరులు
పాల్గొన్నారు.