జస్టిస్ బి.కృష్ణ మోహన్
కర్నూలు : వక్ఫ్ ఆస్తుల పరిరక్షణలో ప్రజలకు సత్వర న్యాయం అందించేలా వక్ఫ్
బోర్డు ట్రిబ్యునల్ పని చేయాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి మరియు కర్నూలు
జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ బి.కృష్ణ మోహన్ పేర్కొన్నారు.
శనివారం కర్నూలులో ఏర్పాటు చేసిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు
ట్రిబ్యునల్ ను రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి , కర్నూలు జిల్లా
అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ బి.కృష్ణ మోహన్ ప్రారంభించారు. ఈ
కార్యక్రమంలో రాష్ట్ర హై కోర్టు న్యాయమూర్తి శ్రీనివాస రెడ్డి, కర్నూలు
ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ & సెషన్స్ జడ్జి ఎన్.శ్రీనివాస రావు , ఆంధ్ర ప్రదేశ్
రాష్ట్ర వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ ఛైర్మన్ జి.భూపాల్ రెడ్డి, మైనారిటీ
సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇంతియాజ్, జిల్లా కలెక్టర్ డా.జి.సృజన
తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, కర్నూలు జిల్లా
అడ్మినిస్ట్రేటివ్ జడ్జి మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో చారిత్రక
ప్రాముఖ్యత కలిగిన కర్నూలులో రాష్ట్ర వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ ను
ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇప్పటికే కర్నూలులో లోకాయుక్త,
హ్యూమన్ రైట్స్ కమిషన్, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వంటి సంస్థలు
ఏర్పాటయ్యాయని, వీటికి అదనంగా అవసరం లో ఉన్న ప్రజలకు న్యాయం చేసేందుకు వక్ఫ్
బోర్డ్ ట్రిబ్యునల్ కూడా చేరిందన్నారు. కేసుల పరిష్కారంలో ట్రిబ్యునల్,
సభ్యులకు బార్ మెంబర్స్ తగిన సహకారం అందించాలని ఆయన కోరారు. వక్ఫ్ ఆస్తుల
పరిరక్షణ, సంబంధిత అంశాలలో సమర్థవంతంగా న్యాయం అందించాలన్నదే వక్ఫ్ బోర్డు
ట్రిబ్యునల్ అంతిమ లక్ష్యం అని, అందరి సహకారంతో ఈ లక్ష్యాన్ని సాధించాలని ఆయన
పిలుపు నిచ్చారు.
రాష్ట్ర హై కోర్టు న్యాయమూర్తి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ కర్నూలులో
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యాలయాన్ని, లోకాయుక్త ను ఏర్పాటు చేశారని,
ప్రస్తుతం రాష్ట్ర వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ కోర్టు ఏర్పాటు అయినందుకు జిల్లా
వాసిగా సంతోషిస్తున్నానన్నారు. రాష్ట్ర విభజన జరిగిన తొమ్మిదేళ్ల తర్వాత
రాష్ట్ర వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ కోర్టు ఏర్పాటు కావడం గొప్ప విషయం
అన్నారు. న్యాయ వ్యవస్థ ప్రజాస్వామ్యానికి వెన్నెముక అని, ఇక్కడే వివాదాలు
పరిష్కరించబడతాయని, వారి నేపథ్యంతో సంబంధం లేకుండా అవసరమైన వారికి హక్కులు
అందించబడతాయని పేర్కొన్నారు. కోర్టులకు మౌలిక సదుపాయాల విషయంలో గతంలో కంటే
మెరుగ్గా ఉన్నామని తెలిపారు..ప్రస్తుతం టెక్నాలజీ బాగా పెరిగిందని,
న్యాయవాదులు ఈ టెక్నాలజీని బాగా వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు.. న్యాయ
సంబంధిత అన్ని అంశాల్లో బార్, బెంచ్ సమన్వయంతో పని చేయాలని సూచించారు.
కర్నూలు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ & సెషన్స్ జడ్జి ఎన్.శ్రీనివాస రావు
మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత సెక్షన్ 83(1) ప్రకారం జిఓ
నంబర్ 16 జారీ చేస్తూ కర్నూలు జిల్లాలో రాష్ట్ర వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్
కోర్టును ఏర్పాటు చేసి ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. ముఖ్యంగా ఈ
ట్రిబ్యునల్ లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ జి.భూపాల్
రెడ్డి చైర్మన్ గా వ్యవహరిస్తారని, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు
ట్రిబ్యునల్ మెంబర్ గా నాగేశ్వర రావు, అబ్దుల్ మజీద్ వ్యవహరిస్తారని అన్నారు.
వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన వివాదాలు, ప్రశ్నలు, ఇతర విషయాలపై వక్ఫ్ ఆస్తుల
నిర్ధారణ హక్కులు, ప్రయోజనాలను సమర్థించేందుకు ట్రిబ్యునల్ కోర్టు పని
చేస్తుందని, విభజన జరిగిన నాటి నుండి ఇప్పటివరకు రాష్ట్ర వక్ఫ్ బోర్డు
ట్రిబ్యునల్ కోర్టులో 213 కేసులు పెండింగ్ లో ఉన్నాయని వివరించారు.
మైనారిటీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏ. ఎండి. ఇంతియాజ్ మాట్లాడుతూ
వక్ఫ్ అనేది ముస్లిం చట్టం ద్వారా గుర్తించబడిన మతపరమైన, పవిత్రమైన ధార్మిక
ప్రయోజనాల కోసం కదిలే లేదా స్థిరాస్తి అని పేర్కొన్నారు..వక్ఫ్ ఆదాయాన్ని
విద్య, అభివృద్ధి, సంక్షేమం మరియు ముస్లిం చట్టం ద్వారా గుర్తించబడిన ఇతర
ప్రయోజనాల కోసం ఖర్చు చేయాలని పేర్కొన్నారు. వక్ఫ్ చట్టం, 1995 నవంబర్ 22న
అమలులోకి వచ్చిందని, సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, స్టేట్ వక్ఫ్ సంస్థల బాధ్యతల
గురించి ఆయన వివరించారు.
జిల్లా కలెక్టర్ డా.జి.సృజన మాట్లాడుతూ జిల్లాలో రాష్ట్ర వక్ఫ్ బోర్డ్
ట్రిబ్యునల్ జిల్లాలో ఏర్పాటు కావడం చాలా సంతోషం అని తెలిపారు..ఈ సంస్థ ద్వారా
వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ లో పూర్తి న్యాయం జరగాలని కలెక్టర్ కోరారు.ఈ
కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి/సీనియర్ సివిల్ జడ్జి
సి.హెచ్. వెంకట నాగ శ్రీనివాస రావు, రాష్ట్ర వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్
సభ్యులు హాబీజ్ డా.అబ్దుల్ మస్జిద్, డి ఆర్ ఓ ఎస్.వి. నాగేశ్వరరావు, ఫ్యామిలీ
కోర్టు జడ్జి ప్రతిభా దేవి, జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కళ్యాణి
,జిల్లా అధికారులు, న్యాయవాదులు పాల్గొన్నారు.