విజయవాడ సెంట్రల్ : సంస్కృత భాష మన దేశ సంస్కృతిలో భాగమని.. భారతదేశ ఆత్మను
అధ్యయనం చేసే విషయంలో సంస్కృత భాషను నేర్చుకోవడం అత్యంత ఆవశ్యకమని రాష్ట్ర
ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు.
సత్యనారాయణపురంలో సంస్కృత భారతీ – ఆంధ్రప్రదేశ్ ప్రాంత కార్యాలయ భవన
ప్రారంభోత్సవం ఆదివారం ఎమ్మెల్యే చేతులమీదుగా జరిగింది. ఆచార్య దోర్బల ప్రభాకర
శర్మ సభాధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సంస్కృత భారతీ అఖిలభారత కార్యదర్శి
సత్యనారాయణ భట్, రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ప్రాంత అధ్యక్షులు హరికుమార్, వివిధ
రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ అన్ని
శాస్త్రాలకూ మూలం సంస్కృతంలోనే ఉందన్నారు. సైన్స్, మాథ్య్స్, ఫిలాసఫీ
వీటన్నిటి మూలాలు సంస్కృత భాషలో ఉన్నాయని ఉద్బోధించారు. కనుక ప్రతి
విద్యార్థి భారతీయ విజ్ఞాన సంపదను వెలికితీసి ముందుకు తీసుకెళ్లేందుకు
సంస్కృతాన్ని తప్పనిసరిగా నేర్చుకోవాలని సూచించారు. ఈ భాషను సరళతరం చేసి
వాడుకలోకి తీసుకొచ్చేందుకు గత నాలుగు దశాబ్దాలుగా సంస్కృత భారతి ఉద్యమ
కార్యాచరణతో పని చేస్తోందని ప్రశంసించారు. సంస్కృత భాష ఒక విజ్ఞాన ఖని అని..
అనేక వైజ్ఞానిక విషయాలు ఈ భాషలో దాగి ఉన్నట్లు ఎమ్మెల్యే చెప్పారు.
శాస్తజ్ఞ్రులు సైతం ఈ భాషను అధ్యయనం చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ భాషను దేవ
భాష అని కూడా పిలుస్తారని, ప్రపంచంలో 35 దేశాలలో సంస్కృతాధ్యయనం జరుగుతోందని
తెలిపారు.
విదేశీయులెందరో సంస్కృత భాషను నేర్చుకొని మన సంస్కృతి, ఇతిహాసాలను
అనువదిస్తున్నట్లు వెల్లడించారు. కానీ మన దేశంలో 2011నాటి లెక్కల ప్రకారం
సంస్కృతం మాట్లాడేవారి సంఖ్య కేవలం 24,821 మాత్రమే అనీ.. ఇటువంటి తరుణంలో
సంస్కృత సాహిత్యం యొక్క ఔన్నత్యాన్ని భావి తరాలకు వివరించాల్సిన ఆవశ్యకత ఉందని
మల్లాది విష్ణు అన్నారు. ఏదో ఒక రోజు సంస్కృతం ప్రపంచ భాషగా మారే అవకాశం
ఉందని, అందులో సంస్కృత భారతి కీలక పాత్ర పోషిస్తుందనడంలో ఎటువంటి సందేహం
లేదన్నారు. సంస్కృత భాషను కాపాడేందుకు కృషి చేస్తున్నవారికి రాష్ట్ర
ప్రభుత్వం ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో
ట్రస్ట్ కార్యదర్శి డా.ఉపద్రష్ట వేంకటరమణమూర్తి, ప్రాంత అధ్యక్షులు జన్నాభట్ల
కుమార చంద్రశేఖర్, స్థానిక కార్పొరేటర్ శర్వాణి మూర్తి, తదితరులు పాల్గొన్నారు.