వేల్పూర్ : సీఎం కేసీఆర్ జనరంజక పాలన, సంక్షేమ కార్యక్రమాలు, నియోజకవర్గంలో
జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై కాంగ్రెస్, బీజేపీకి చెందిన నాయకులు వారి
పార్టీలకు రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరుతున్నారు. నిజామాబాద్ జిల్లా
ముప్కాల్ మండలం రెంజర్ల, ఏర్గట్ల మండలం నాగేంద్రనగర్ గ్రామానికి చెందిన
కాంగ్రెస్, బీజేపీ నాయకులు, యువకులు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సమక్షంలో
మంగళవారం బీఆర్ఎస్ లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి
ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొట్లాడి సాధించుకున్న తెలంగాణ
తలెత్తుకొని నిలబడాలనేదే కేసీఆర్ తపన అని అన్నారు. తెలంగాణ అంతా ఒక
కుటుంబమైతే ఆ ఇంటి పెద్ద కేసీఆర్ అని, కుటుంబం ఎప్పుడూ బాగుండాలని ఇంటి పెద్ద
ఆరాటపడుతాడని పేర్కొన్నారు. తెలంగాణను కంటికి రెప్పలా కాపాడుకునే కేసీఆర్‌కు
అన్ని వర్గాల ప్రజలు అండగా నిలువాలని పిలుపునిచ్చారు. హరితహారం ద్వారా
రాష్ట్రంలో 9 శాతం గ్రీనరీ పెరిగిందని, ఇంత పచ్చదనం పెంపు ప్రపంచంలోనే ఎక్కడా
సాధ్యం కాలేదన్నారు. సమాజ హితం, భవిష్యత్తు తరాల కోసం మాత్రమే చేపట్టిన
కార్యక్రమమని, ఓట్ల కోసమో రాజకీయం కోసమో చేసింది కాదని వివరించారు. కాంగ్రెస్
హయాంలో ఎరువుల కోసం చెప్పులు లైన్లో పెట్టేదని, పోలీస్ స్టేషన్లో పెట్టి
ఎరువులు అమ్మారని గుర్తు చేశారు. అలాంటి బాధలు కేసీఆర్ దూరం చేశారని
వెల్లడించారు.
ఆ పార్టీలు అవసరమా ? : రైతులకు 3 గంటల కరెంట్ చాలంటున్న చేతి గుర్తోడు
(కాంగ్రెస్) వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెడతామంటున్న పువ్వు గుర్తోడు(బీజేపీ)
మనకు అవసరమా అని అన్నారు. పక్కన కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్
ప్రభుత్వం 4 వేల పెన్షన్ ఎందుకు ఇస్తలేదని తెలంగాణలో ఎట్లా ఇస్తారని
ప్రశ్నించారు. ఓట్లు అయితే పడని తర్వాత చూద్దామనే నీచ వైఖరి కాంగ్రెస్‌దని
మండిపడ్డారు. వాళ్లు అధికారంలో ఉన్నప్పుడే ఏమీ చేయనోళ్లు ఇప్పుడు చందమామ
తెచ్చి ఒడిలో పెడుతాం, సూర్యుడిని కిందికి దించుతామంటే ప్రజలు నమ్ముతారా అని
ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజల బాగు కోరేది కేసీఆర్. తెలంగాణ ప్రజల ఓట్లు
కోరేది బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు. అని మోసపు మాటలతో, అబద్ధపు హామీలతో
ఎన్నికల వేళ ఇస్తున్న హామీలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.