ఒంగోలు : విద్యతో పాటు జీవితంలో విలువలు కూడా అత్యంత ముఖ్యమని, భారతీయ సంస్కృతిలో భాగమైన విలువలను ప్రతి విద్యార్థి తన జీవితంలో అలవరుచుకోవాలని భారతదేశ గౌరవ పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. పూర్వ ప్రకాశం జిల్లా వేటపాలెంలో ఉన్న శ్రీ బండ్ల బాపయ్య విద్యాసంస్థల శతాబ్ధి ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. చేనేత పరిశ్రమ ప్రధాన వృత్తిగా ఉన్న వేటపాలెం లాంటి గ్రామీణ ప్రాంతంలో పేదల జీవితాల్లో విద్యా కాంతులు నింపే ఉన్నత సంకల్పంతో స్వర్గీయ రావు సాహెబ్ బండ్ల బాపయ్య శెట్టి వందేళ్ళ క్రితమే ఆలోచించటం వారి దార్శనికతకు నిదర్శనమన్న ఆయన, వారి మూడు తరాల వారు ఈ సంస్థను అదే స్ఫూర్తితో ముందుకు తీసుకుపోవడం, విద్యాసంస్థ ప్రారంభమైన నాటి నుంచి పేద పిల్లలకు ఉచితంగా గొల్లపూడి వారు మధ్యాహ్న భోజనాన్ని అందించటం అభినందనీయమని, భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమని తెలిపారు.
విద్యార్థులే భవిష్యత్ భాగ్యవిధాతలు అన్న వెంకయ్యనాయుడు, వారిలో విలువలను పెంపొందించే ఉద్దేశంతో భారతప్రభుత్వం జాతీయ విద్యావిధానం – 2020కి రూపకల్పన చేసిందని తెలిపారు. మాతృభాషతో పాటు ప్రపంచస్థాయి విజ్ఞానం, భారతీయ విలువలతో పాటు ప్రపంచ స్థాయి సాంకేతికతకు చోటు కల్పించిన నూతన విద్యావిధానం విజయవంతం కావాలంటే విద్యాసంస్థల చొరవ అత్యంత ఆవశ్యకమని తెలిపారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని విద్యాసంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
బండ్ల బాపయ్య సేవానిరతి ఉన్నతమైనదన్న ముప్పవరపు వెంకయ్యనాయుడు, నాటి మద్రాస్ గవర్నర్ ఈ పాఠశాలను సందర్శించి ప్రోత్సహించటం, స్వాతంత్ర్యానంతరం 1953లో గ్రాంట్ – ఇన్ – ఎయిడ్ రూపంలో ప్రభుత్వ సహకారం అందడం ఇందుకు నిదర్శనమని తెలిపారు. వారి కుటుంబ సభ్యులు ఇదే స్ఫూర్తితో ముందుకు సాగడం అభినందనీయమన్న ఆయన, నిజమైన వారసత్వమంటే ఇదేనని తెలిపారు.
పిల్లలు సేవా భావాన్ని వారసత్వంగా తీసుకుంటే పెద్దలు ఎంతో ఆనందిస్తారని అందులో తాను కూడా ఉన్నారని తెలిపారు. స్వర్ణభారత్ ట్రస్ట్ ద్వారా వారి పిల్లలు సేవా భావాన్ని పుణికిపుచ్చుకోవడం తనకు జీవితంలో అత్యంత ఆనందకరమైన అంశమని పేర్కొన్నారు. విద్యాసంపద ఎవ్వరూ దొంగలించలేదని గొప్పనిధి అని, పంచే కొలదీ మరింత పెరుగుతుందన్న వెంకయ్యనాయుడు విద్యార్థులు అలాంటి సంపదను అందిపుచ్చుకోవాలని సూచించారు. ప్రధానంగా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు ఇష్టంగా కష్టపడి పనిచేయడానికి మించిన మార్గం లేదన్న ఆయన, పెద్దల పట్ల గౌరవం, ఆరోగ్యకరమైన జీవనశైలి, సాయపడే వ్యక్తిత్వాన్ని జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు.
ప్రస్తుతం యువత పాశ్చాత్య సంస్కృతికి బాగా అలవాటు పడుతోందన్న ఆయన, మన జీవనశైలి విషయంలో సానుకూల మార్పులు అవసరమని సూచించారు. నిత్యం వ్యాయామం చేయడం, యోగాభ్యాసంతో పాటు పోషకాలతో కూడిన ఆరోగ్యకమైన భారతీయ ఆహారాన్ని తీసుకోవటం అత్యంత ఆవశ్యకమని తెలిపారు. ప్రకృతిని ప్రేమించటం ప్రకృతితో కలిసి జీవించటం ద్వారా చక్కని ఆరోగ్యం సాధ్యమౌతుందని సూచించారు.
ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎంత ఉన్నతమైన స్థాయికి చేరినా కన్నతల్లి, జన్మభూమి, మాతృభాష, మాతృదేశం, చదువు చెప్పిన గురువును మరువవద్దన్న వెంకయ్యనాయుడు, ఒక మహత్తర భాషకు వారసుణ్ని అని చెప్పుకోవడానికి మించిన గర్వకారణం ఏముంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ బండ్లబాపయ్య విద్యాసంస్థల యాజమాన్యం, సిబ్బంది, విద్యార్థులు సహా జిల్లా అధికారులు పాల్గొన్నారు.