2024 ఎన్నికల్లో మరోమారు జగన్ ను సీఎంగా ఆశీర్వదించాలి
రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి
అమరావతి : అర్హులైన ఉండి ఏ కారణం చేతనైనా లబ్ది పొందని వారికి మరో అవకాశం కల్పించి వివిధ సంక్షేమ పథకాల కింద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించిందని,శతశాతం అర్హులైన లబ్దిదారులందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి అన్నారు. సోషల్ మీడియా వేదికగా శుక్రవారం పలు అంశాలు వెల్లడించారు. 2023 ఆగస్టు1 నుండి డిసెంబర్ 31 మధ్య కాలంలో లబ్ది పొందని 68,990 మందికి శుక్రవారం రూ.97.76 కోట్లు ఆర్థిక సాయం అందించారని తెలిపారు. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం, జగనన్న అమ్మ ఒడి, వైఎస్సార్ నేతన్న నేస్తం, వైఎస్సార్ కాపు నేస్తం, వైఎస్సార్ వాహన మిత్ర, జగనన్న చేదోడు, వైఎస్సార్ కళ్యాణమస్తు, సాదీ తోఫా, వైఎస్సార్ మత్స్యకార భరోసా మొదలగు పథకాల కింద గతంలో లబ్ది పొందని అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించారని అన్నారు.
జాతీయ స్థాయిలో ఏపీకి ఆరు అవార్డులు : వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ లో ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో 6 అవార్డులు సొంతం చేసుకోవడంతో రాష్ట్రంలోని చైతన్యవంతమైన విభిన్న స్థానిక పరిశ్రమల సత్తా జాతీయ స్థాయిలో అద్దం పట్టిందని విజయసాయి రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అరకు కాఫీ, ఉప్పాడ జమ్దానీ చీరలు, పొందూరు కాటన్ చీరలు, గద్వాల్ చీరలు, మండపల్లి పట్టు చీరలు, మంగళగిరి చేనేత వస్త్రాలు సత్ఫలితాలను అందించాయని అన్నారు.
2023 ఏపీకి పారిశ్రామిక విజయాల సంవత్సరం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2023 పారిశ్రామిక విజయాల సంవత్సరంగా విజయసాయి రెడ్డి అభివర్ణించారు. గడిచిన ఏడాదిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు కేంద్రంగా మారిందని అన్నారు. రూ.13 లక్షల కోట్ల ప్రతిపాదనలు, గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో ముందంజ, ఎంఎస్ఎంఈ వృద్ధిలో ఏపీ తన మార్కును ప్రదర్శించిందని అన్నారు. సులభతర వాణిజ్య ర్యాంకులో ప్రథమ స్థానం కొనసాగింపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమర్థతకు అద్దం పడుతోందని అన్నారు. రాష్ట్ర ఉజ్వల భవిష్యత్ కు, అన్ని రంగాల్లో జరుగుతున్న అభివృద్ధి, అందిస్తున్న సంక్షేమం కొనసాగేందుకు ప్రజలు 2024లో మరోమారు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఆశీర్వదించాలని విజయసాయి రెడ్డి కోరారు.