రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్ : హైదరాబాద్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థలో మేడారం సమ్మక్క సారక్క జాతర పై మంత్రుల సమీక్షా సమావేశం జరిగింది. సమీక్షా సమావేశంలో రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ , దేవాదాయ శాఖ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీ రాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సీఎస్ శాంతి కుమారి , డీజీపీ రవి గుప్తా,పోలీస్ రెవిన్యూ అటవీ గిరిజన శాఖ ఉన్నత అధికారులు హనుమకొండ, వరంగల్ ములుగు, జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్లు,పోలీస్, అటవీ, రోడ్లు భావనాలు, రవాణా, సమాచార శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో రెవెన్యూ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకమైన సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.75 కోట్లను విడుదల చేసిందని అన్నారు. దేశంలో అత్యధిక భక్తులు సందర్శించే ఈ జాతర నిర్వహణ పై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్నారు. ఈ జాతరలో గిరిజన, ఆదివాసీ సంప్రదాయ నృత్యలతో పాటు ఇతర రాష్ట్రాల కళాకారుల బృందాలతో ప్రత్యేక మైన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. జాతర లో మీడియా సెంటర్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ దఫా జాతర ప్రాంతాన్ని 10 జోన్లు గా వర్గీకరించాలన్నారు. భక్తులు వన దేవతల ను ప్రశాంతంగా దర్శించుకుని తిరిగి అంతే ప్రశాంతంగా వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. భక్తులకు స్నానాల ఘట్టల వద్ద ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని, జంపన్న వాగులో నీరు పరి శుభ్రం గా ఉండేలా చర్యలు తీసుకునేందుకు ఎప్పటికప్పుడు వ్యర్థాలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. శానిటేషన్ పనులను కాడా అధికారులు సమర్ధవంతంగా చేపట్టాలన్నారు. పెండింగ్ పనులపై దృష్టి సారించాలన్నారు. గతంలో కంటే మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. తాగునీరు ఇతర వసతుల కల్పన పై దృష్టి సారించాలన్నారు. సామాన్య భక్తుల క్యూలైన్లు, భారీకేడ్లు ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మేడారం జాతర పనులు త్వరితగతిన పూర్తికావడానికి జిల్లా కలెక్టర్లు అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు. గతంలో అక్కడ పని చేసిన అధికారులకు జాతర ఏర్పాట్ల భాధ్యతలు అప్పగిస్తే సమస్యలు తలెత్తవన్నారు. ట్రాఫిక్ జామ్ ,రూట్ క్లియారెన్స్ కోసం ప్రత్యేక నోడల్ అధికారులను నియమించాలన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమ్మక్క సారక్క జాతర విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సారి జాతరకు కోటి 50 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంతేకాకుండా మహాలక్ష్మి పథకం ద్వారా మహిళా భక్తుల రద్దీ కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని అన్నారు. వచ్చే భక్తుల రద్ధీకి అనుగుణంగా ఈసారి 6 వేల బస్సులు నడిపించడానికి ఆర్టీసీ ఏర్పాట్లు చేయాలన్నారు. జాతర కోసం అదనంగా బస్సులు వేయడం వల్ల 3 రోజుల పాటు హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాలో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున ప్రైవేట్ బస్సులు , స్కూల్ బస్సులు ఏర్పాటు చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సంబందిత అధికారుకు సూచించారు.
పంచాయతీ రాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ మేడారం జాతర ను ఈ సారి ప్లాస్టిక్ రహిత జాతర గా నిర్వహించాలన్నారు. జాతర లో పర్యావరణ పరిరక్షణకు ప్రాముఖ్యత ఇవ్వాలన్నారు. అటవీ ప్రాంతాన్ని సంరక్షించడం తో పాటు అటవీ జంతువులకు హాని కలగకుండ చూడాలన్నారు. స్నాన ఘట్టాల వద్ద తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. రహదారులకు ఇరువైపులా ఆర్ అండ్ బి అధికారులు సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. రోడ్ల మరమ్మత్తులు సత్వరమే పూర్తి చేయాలన్నారు. జాతర కు వచ్చే చిన్నారులు తప్పిపోతే వారి తలితండ్రుల వద్దకు చేర్చేందుకు కాల్ సెంటర్ లను ఏర్పాటు చేయాలన్నారు. గర్భిణీ లకు చిన్నారులకు ప్రత్యేకంగా బాలామృతం అందించాలని అధికారులను ఆదేశించారు. పార్కింగ్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పోలీసు ప్రత్యేక కంట్రోల్ రూం లు ఏర్పాటు చేసి సిసి కెమెరాలతో నిఘా పెంచాలన్నారు. అధికారులు క్రమం తప్పకుండ సమీక్ష సమావేశాలు నిర్వహించి మేడారం అభివృద్ధి పనులను వేగవంతం చేయాలన్నారు.
దేవాదాయ , అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ గిరిజన, ఆదివాసీ సంప్రదాయలకు అత్యంత ప్రాముఖ్యత ఇవ్వాలన్నారు. టూరిజం అభివృద్ధి చెందటానికి తగిన బస్సులను నడపాలన్నారు. జాతర లో దొంగతనాలు జరగకుండా పోలీస్ అధికారులు పటిష్ట నిఘా ఉంచాలన్నారు. మహా జాతర విశిష్ఠతను డాక్యుమెంటరిగా రూపొందించాలన్నారు.ఉమ్మడి జిల్లాలో జరిగే జాతరలన్నింటిని కూడా ఘనంగా నిర్వహించాలని మంత్రి సూచించారు. నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని విధ్యుత్ అధికారులను ఆదేశించారు. జాతర గురించి భక్తులకు అవగాహన కల్పించేందుకు ప్రింట్ ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలలో విస్తృత ప్రచారం చేయాలన్నారు.