స్వతంత్రులకు 62, విపక్షాలకు 14
ఢాకా: బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ఘన విజయం సాధించింది. ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ 299 సీట్లకుగానూ 223 చోట్ల విజయ కేతనం ఎగురవేసింది. దీంతో హసీనా వరుసగా నాలుగోసారి, మొత్తంగా అయిదోసారి ప్రధాని పదవి చేపట్టనున్నారు. స్వతంత్రులు 62 స్థానాల్లో గెలిచినట్లు ఎన్నికల సంఘం(ఈసీ) ప్రకటించింది. జాతీయ పార్టీ(జాపా) 11 సీట్లు, మరో మూడు విపక్ష పార్టీలు 3 సీట్లు గెలుచుకున్నట్లు వెల్లడించింది. బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ మగుర-1 స్థానం నుంచి అవామీ లీగ్ తరఫున 1.5లక్షలకు పైగా మెజారిటీతో గెలుపొందారు. బంగ్లాదేశ్ పార్లమెంటులో 300 సీట్లు ఉండగా, 299 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఓ స్థానంలో అభ్యర్థి మరణించడంతో ఎన్నికను నిలిపివేశారు. ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ(బీఎన్పీ)తోపాటు మరో 15 పార్టీలు ఈ ఎన్నికలను బహిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలింగ్ శాతం భారీగా పడిపోయింది. తుది గణాంకాల ప్రకారం 41.8 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ ప్రకటించింది. మరోవైపు ఈ బోగస్ ఎన్నికలను రద్దు చేయాలని బీఎన్పీ డిమాండ్ చేసింది. పార్టీలకతీతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, దాని ఆధ్వర్యంలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని పిలుపునిచ్చింది.
హసీనాకు మోడీ ఫోన్ : ఎన్నికల్లో విజయం సాధించిన హసీనాకు ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్లో అభినందనలు తెలిపారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసుకునే దిశగా భారత్ కృషి చేస్తుందని స్పష్టం చేశారు. మరోవైపు ఢాకాలోని భారత్ హై కమిషనర్ ప్రణయ్ కుమార్ వర్మ హసీనాను కలసి భారత్ తరఫున అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో విజయం అనంతరం షేక్ హసీనా విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. భారత్ తమకు నమ్మకమైన మిత్రదేశమని, ఆ దేశంతో అద్భుతమైన సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు.