ఏర్పాట్లపై సమీక్షించిన సిఎస్ జవహర్ రెడ్డి
విజయవాడ : ప్రధానమంత్రి నరేంద్ర మోడి ఈనెల 16న శ్రీ సత్యసాయి జిల్లా పాల సముద్రంలో పర్యటించ నున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై శనివారం విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ప్రధాని పర్యటనకు పటిష్టమైన భద్రతా చర్యలతో పాటు పర్యటన విజయవంతానికి కట్టుదిట్టమైన విస్తృత ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. తాత్కాలికంగా ఖరారైన ప్రోగ్రాం ప్రకారం ఈనెల 16న మధ్యాహ్నం ప్రధాని పాలసముద్రం చేరుకుని స్థానిక కార్యక్రమాల్లో పాల్గొన్న పిదప అదే రోజు సాయంత్రం తిరిగి వెళ్ళనున్నారని తెలిపారు. కావున ఏర్పాట్లలో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేని విధంగా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సత్యసాయి జిల్లా కలెక్టర్,ఎస్పీలను సిఎస్ ఆదేశించారు.అదే విధంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాల్సిందిగా వర్చువల్ గా పాల్గొన్న డిజిపి రాజేంద్ర నాధ్ రెడ్డికి చెప్పారు. ప్రధాన మంత్రి పర్యటనలో రాష్ట్ర గవర్నర్,ముఖ్యమంత్రి వర్యులు కూడా పాల్గొనే అవకాశం ఉన్నందున వారికి కూడా తగిన పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని సిఎస్ డా.జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.ముఖ్యంగా ప్రధాని పర్యటనకు సంబంధించి భద్రత,రవాణా, వసతి,వైద్య సేవలు వంటివి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేలా చూడాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. అదే విధంగా ప్రధాని పర్యటన సందర్భంగా దూరదర్శన్, ఆకాశవాణి సహా ఇతర ఎలక్ట్రానిక్ మీడియా,ప్రింట్ మీడియాల ద్వారా విస్తృత ప్రచారం కల్పించేందుకు సమాచార శాఖ అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.జిల్లా యంత్రాంగం సమన్వయంతో అవసరమైన చోట్ల స్వాగత తోరణాలు సహా ఇతర హోర్డింగులు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ తరపున అన్ని రకాల అత్యవసర వైద్య సౌకర్యాలతో కూడిన వైద్య బృందాలను, సరిపడిన మందులను అందుబాటులో ఉంచాలని సిఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు.అంతేగాక సమీపంలో గల శ్రీ సత్యసాయి ఆసుపత్రిని అత్యవసర వైద్య సేవలకై నోడలు ఆసుపత్రిగా సిద్ధం చేసి ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి జిల్లా యంత్రాంగం తరపున పాస్ లు జారీ చేయాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్,ఎస్పీలను సిఎస్ ఆదేశించారు.ఇంకా ప్రధాన మంత్రి పర్యటనకు సంబంధించి పలు ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సిఎస్ డా.జవహర్ రెడ్డి సమీక్షించారు. ఈ సమావేశంలో వర్చువల్ గా పాల్గొన్న రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ కెవి.రాజేంద్రనాధ్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని పర్యటనకు సంబంధించి విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అంతకు ముందు జిఏడి ముఖ్య కార్యదర్శి ఆర్.ముత్యాల రాజు వివిధ శాఖల వారీగా చేయాల్సిన ఏర్పాట్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఇంకా ఈసమావేశంలో రాష్ట్ర ఎస్ఐబి ఐజి వినీత్ బ్రిజ్ లాల్, ఐఅండ్ జెడి పి.కిరణ్ కుమార్ పాల్గొన్నారు.అదే విధంగా వర్చువల్ గా శ్రీసత్య సాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పి మాధవ రెడ్డి,డైరెక్టర్ ప్రోటోకాల్ బాలసుబ్రహ్మణ్యం రెడ్డి,డియంఇ డా.నరసింహం, ఐఅండ్ పిఆర్ జెడి టి.కస్తూరి, డైరెక్టర్ ఫైర్ సర్వీసెస్ డి.మురళి తదితర అధికారులు పాల్గొన్నారు.