ఆంధ్రప్రదేశ్ కమిటీ కార్యనిర్వహణ అధ్యక్షుడు షేక్ మస్తాన్ వలి
విజయవాడ : ఈ దేశంలోని సర్వ మతాలు గౌరవించే శ్రీరాముడుని ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి. రాజకీయ లబ్ధి కోసం ఒక సాధనంగా ఉపయోగించుకుంటున్నదని ఆంధ్రప్రదేశ్ కమిటీ కార్యనిర్వహణ అధ్యక్షుడు షేక్ మస్తాన్ వలి తీవ్రంగా విమర్శించారు. మోడీ పాలనలో దేశంలోని మేధావి వర్గం ప్రతిపక్ష రాజకీయవేత్తలు కలమెప్పి మాట్లాడలేని పరిస్థితి నెలకొన్నదని, రామరాజ్యం అంటే ఇదేనా అని మస్తాన్ వలీ ప్రశ్నించారు. బుధవారం విజయవాడ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆంధ్ర రత్న భవన్ లో మీడియా సమావేశంలో మస్తాన్ వలీ మాట్లాడారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం అసంపూర్తిగా వున్న కారణంగా రాముడి విగ్రహ ప్రతిష్టాపన ప్రారంభ కార్యక్రమానికి తమ పార్టీ హాజరు కావడం లేదని ఆయన తెలిపారు. పలువురు పీఠాధిపతులు కూడా హాజరు కావడం లేదని ఆయన పేర్కొన్నారు. దళితులు అణగారిన వర్గానికి చెందిన మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే నరేంద్ర మోడీ నోరు మెదపడం లేదని మస్తాన్ వలీ అన్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని నరేంద్ర మోడీకి తాకట్టు పెట్టారని, పార్లమెంటు సాక్షిగా నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చిన ఏపీకి ప్రత్యేక హోదా గురించి ప్రశ్నించడం లేదని మస్తాన్ వలీ విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా డాక్టర్ రాజశేఖర్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల గుండెల్లో నిలిచిపోతే, జగన్మోహన్ రెడ్డి తండ్రి ఆశయాలను తుంగలో తొక్కారని ఆయన విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి పాలన “మైను – వైను”, “ల్యాండ్ -స్కామ్” గా సాగుతుందని మస్తాన్ వలీ దుయ్యబట్టారు. మీడియా సమావేశంలో మస్తాన్ వలీ తో పాటు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొలనుకొండ శివాజీ, మీసాల రాజేశ్వరరావు, ప్రధాన కార్యదర్శులు బైపూడి నాగేశ్వరరావు, ఖుర్షీదా, షేక్ నాగూర్, బేగ్, అల్లం సురేష్ తదితరులు పాల్గొన్నారు.