ఐటీ డెవెలప్ మెంట్, సర్వీసెస్ అందించే క్యూ సెంట్రియో కంపెనీ తెలంగాణలో తమ కార్యకలాపాలను విస్తరించనుంది. దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కంపెనీ ప్రతినిధి ఎలమర్తి సమావేశమయ్యారు. ఆయిల్ అండ్ గ్యాస్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ట్రావెల్ అండ్ హాస్పిటాలిటీ, ఆటోమోటివ్, అగ్రికల్చర్ మరియు ఇంజినీరింగ్ వంటి రంగాలలో అత్యాధునిక ఐటీ సేవలు అందించటంతో ఈ కంపెనీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. అమెరికా, ఆసియా పసిఫిక్ రీజియన్లో ఇప్పటికే కార్యకలాపాలను విస్తరించింది. అర్టిఫియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ ప్రాసెస్ అటోమేషన్, మెషిన్ లర్నింగ్, బ్లాక్ చైన్ సొల్యూషన్ వరకు వివిధ అధునాతన సాంకేతిక సేవలను ఈ సంస్థ అందిస్తోంది. కంపెనీ విస్తరణలో భాగంగా హైదరాబాద్ పరిధిలో దాదాపు 1000 ఉద్యోగాల కల్పనను లక్ష్యంగా ఎంచుకుంది. వ్యాపార అవకాశాలు, పర్యావరణ అనుకూలతలున్నందున హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఈ సంస్థ ఆసక్తిని ప్రదర్శించింది. తగిన సహాయ సహకారాలు అందించాలని ప్రభుత్వాన్ని కోరింది. ఐటీ రంగంలో మూడు దశాబ్దాలుగా తమ కంపెనీ ఎన్నో విజయాలు సాధించిందని క్యూ సెంట్రియో సారథ్యం వహించి యలమర్తి సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రాభివృద్ధి, శ్రేయస్సులో తమ కంపెనీ భాగస్వామ్యం పంచుకుంటుందని అన్నారు.