రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్
పామర్రు : రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానున్న 125 అడుగుల ఎత్తు కలిగిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు లక్షలాదిగా ప్రజలందరూ తరలిరావాలని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ కోరారు. గురువారం మధ్యాహ్నం ఆయన పామర్రు ఆర్ అండ్ బి అతిథి గృహంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించి రేపు రాష్ట్ర ముఖ్యమంత్రిచే ప్రారంభించనున్న బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశానికి దిక్సూచి, ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 125 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని విజయవాడలోని స్వరాజ్య మైదానంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించనున్నారని, ఈ కార్యక్రమానికి కుల మత పార్టీ వర్గ విభేదాలు లేకుండా ప్రజలందరూ స్వచ్ఛందంగా తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరారు. విజయవాడ నడిబొడ్డున ఎంతో విలువైన సుమారు 20 ఎకరాల సువిశాల స్థలంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకొని సముచిత స్థానం కల్పించిందుకు అంబేద్కర్ గారి అభిమానులు, ప్రజలందరి తరఫున ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నారు. నాలుగు వందల కోట్లకు పైగా ఖర్చుతో స్వరాజ్ మైదానంలో రూపుదిద్దుకున్న అంబేద్కర్ స్మృతి వనంలోని విశిష్టతలను ఆయన వివరించారు. విగ్రహం ఎత్తు 125 అడుగులు, పీఠం ఎత్తు 81 అడుగులతో కలిపి మొత్తం 206 అడుగులు కలిగి ఉంటుందని అన్నారు. విగ్రహం కింది భాగంలో మూడు వేల మంది కూర్చోగలిగే మల్టీ కన్వెన్షన్ హాల్, 2 వేల మంది ఆసీనులు కాగల ఓపెన్ థియేటర్, పదివేల పుస్తకాలతో గ్రంథాలయం, బుద్ధిస్టుల ధ్యాన కేంద్రం, ఫౌంటెన్లు, పార్కు వంటి అన్ని రకాల సదుపాయాలతో దేశంలో కనీ వినీ ఎరుగని రీతిలో అద్భుతంగా నిర్మించడం జరిగిందన్నారు. ఈ విగ్రహాన్ని స్వేచ్ఛ, సమానత్వానికి గుర్తుగా (స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ, లిబర్టీ) అని పిలుస్తామని తెలిపారు. ఈ స్మృతి వనం రానున్న కాలంలో గొప్ప పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒక గొప్ప పండుగగా నిర్వహించనున్నదని, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కేవలం ఒక వర్గానికి మాత్రమే సంబంధించిన వ్యక్తి కాదని, దేశంలోని ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వం కల్పించిన మహోన్నత వ్యక్తి విగ్రహావిష్కరణకు రాష్ట్రవ్యాప్తంగా లక్షలాదిగా ప్రజలందరూ స్వచ్ఛందంగా తరలిరావాలని చైర్మన్ కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ నాగదేసి రవికుమార్, దళిత సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.