పెత్తందారులకు దళితులంటే చులకన
రాష్ట్రాన్ని దోచుకోవడమే పెత్తందారుల లక్ష్యం
బీసీ, ఎస్సీ, ఎస్టీలపై చంద్రబాబుకు ఏ కోశానా ప్రేమలేదు
అంబేద్కర్ భావజాలం పెత్తందారులకు నచ్చదు
చంద్రబాబుకు దళితులంటే నచ్చదు
ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సామాజిక సమతా సంకల్ప సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి
విజయవాడలో 125 అడుగుల ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్
విజయవాడ స్వరాజ్య మైదానంలో భారీ అంబేద్కర్ విగ్రహం
విగ్రహాన్ని జాతికి అంకితం చేసిన ఏపీ సీఎం జగన్
విజయవాడ : పోరాటానికి రూపమే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికీర్తించారు. పెత్తందారుల పత్రికలు చరిత్రను కూడా వక్రీకరిస్తున్నాయని, ఎల్లో మీడియాను చూస్తే పాత్రికేయం ఏ స్థాయికి దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సామాజిక సమతా సంకల్ప సభలో మాట్లాడుతూ పేదవాడి పిల్లలు ఎప్పటికీ పనివాళ్లుగా ఉండిపోవాలా? అంటూ ప్రశ్నించారు. పేదలు చదివే ప్రభుత్వ స్కూళ్లను పట్టించుకోకపోవడం అంటరానితనమే. పేదలకు ఇళ్లు ఇస్తుంటే అడ్డుకోవడం కూడా అంటరానితనమే. పేదపిల్లలకు ట్యాబ్లు ఇస్తుంటే కుట్రపూరిత వార్తలు రాయడం అంటరానితనమే. దళితులకు చంద్రబాబు సెంటు భూమి కూడా ఇచ్చింది లేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీలపై చంద్రబాబుకు ఏ కోశానా ప్రేమలేదు. ప్రభుత్వం బడుల రూపురేఖలు మారిస్తే పెత్తందారులకు నచ్చడం లేదు. అంబేద్కర్ భావజాలం పెత్తందారులకు నచ్చదని సీఎం జగన్ దుయ్యబట్టారు. పెత్తందారులకు దళితులంటే చులకన. పెత్తందారీ పార్టీలకు, పెత్తందారి నేతలకు పేదలు అవసరం లేదు. రియల్ ఎస్టేట్ రాజధాని కోసం పేదల భూములు లాక్కున్నారు. రాష్ట్రాన్ని దోచుకోవడమే పెత్తందారుల లక్ష్యం. గతంలో చంద్రబాబు ఎందుకు బటన్ నొక్కలేకపోయారు. చంద్రబాబు ఎందుకు సామాజిక న్యాయం అమలు చేయలేకపోయారని సీఎం జగన్ ధ్వజమెత్తారు.
ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి
విజయవాడ స్వరాజ్య మైదాన్ లో ఏర్పాటు చేసిన 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం సాయంత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక న్యాయ మహాశిల్పం పేరిట అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. అందరినీ ఒక్కతాటిపై తీసుకురావడానికి అంబేద్కరే స్ఫూర్తి అని పేర్కొన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహం ప్రపంచంలోని ఇతర అంబేద్కర్ విగ్రహాలన్నింటి కంటే పెద్దది అని వెల్లడించారు. స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ కు ఇకపై విజయవాడ చిరునామాగా మారుతుందని పేర్కొన్నారు. ఈ మహా విగ్రహం అందరికీ స్ఫూర్తిదాయకం అని, కానీ పెత్తందారుల పత్రికలు చరిత్రను కూడా వక్రీకరిస్తున్నాయని సీఎం జగన్ విమర్శించారు. అంబేద్కర్ భావజాలం పెత్తందార్లకు నచ్చదని అన్నారు. దళిత, బలహీన వర్గాలపై చంద్రబాబుకు ప్రేమ లేదని విమర్శించారు.
పూర్తిగా మేడిన్ ఇండియా : విజయవాడలో నెలకొల్పిన అంబేద్కర్ విగ్రహాన్ని పూర్తిగా స్వదేశీ వస్తువులతోనే రూపొందించారు. ఇందుకోసం రూ.404.35 కోట్లు ఖర్చు చేశారు. 18.18 ఎకరాల్లో ఈ భారీ ప్రాజెక్టు నిర్మించారు. దీంట్లో అంబేద్కర్ పీఠం 81 అడుగులు కాగా, ప్రధాన విగ్రహం 125 అడుగుల ఎత్తు ఉంటుంది. పీఠంపై జీ ప్లస్ 2 తరహాలో గదులు నిర్మించారు. పీఠాన్ని బౌద్ధ మత కాలచక్ర మహామండపం తరహాలో తీర్చిదిద్దారు. ఇక్కడ అంబేద్కర్ జీవిత విశేషాలతో కూడిన ప్రత్యేక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. అంతేకాదు, రెండు వేల మంది సామర్థ్యంతో కూడిన కన్వెన్షన్ సెంటర్ కూడా ఉంది.