విజేతలకు సినీ తారల చేతుల మీదుగా బహుమతులు * పుంగనూరులో సందడి చేసిన తమన్నా, సింగర్ సునీత, యాంకర్ సుమ * వచ్చే ఏడాది భారీ ఎత్తున పోటీలు * భారత చైతన్య యువజన పార్టీ అధినేత బొడె రామచంద్ర యాదవ్ * 400 మంది ఆడపడుచులకు బహుమతులు అందజేత
పుంగనూరు : పుంగనూరులో ప్రముఖ సినీ నటి తమన్నా, యాంకర్ సుమ, నేపథ్య గాయని సునీత తదితరులు సందడి చేశారు. భారత చైతన్య యువజన (బీసీవై) పార్టీ అధినేత బొడె రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా పుంగనూరు నియోజకవర్గ వ్యాప్తంగా ముగ్గుల పోటీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పోటీల విజేతలకు శుక్రవారం బహుమతుల ప్రదానోత్సవం జరిగింది. విజేతలకు ప్రముఖ సినీ నటి తమన్నా, సింగన్ సునీత, యాంకర్ సుమ చేతుల మీదుగా బహుమతులు, కానుకలు అందజేశారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా జరుపుకునే పండుగ సంక్రాంతి, ఈ సందర్భంగా రామచంద్ర యాదవ్ ఆద్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయమని తమన్నా అన్నారు. వచ్చే ఏడాది కూడా ఇక్కడి సంక్రాంతి వేడుకలో తాను తప్పక పాల్గొంటానని తెలిపారు.
వచ్చే ఏడాది మరింత భారీగా నిర్వహణ : బొడె రామచంద్ర యాదవ్
ఈ సందర్భంగా బొడె రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ భగవంతుడు ఆశీర్వదిస్తే వచ్చే ఏడాది సంక్రాంతి సంబరాలను రాష్ట్రంలో ఎక్కడా జరగని విధంగా భారీ ఎత్తున పుంగనూరులో నిర్వహిస్తామని తెలిపారు. తాము ఇచ్చిన చిన్న పిలుపునకు నియోజకవర్గంలోని వందలాది మంది ఆడపడుచులు స్పందించి ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారని, వారందరికీ ధన్యవాదుల తెలిపారు. ఈ సంక్రాంతి అందరి జీవితాల్లో వెలుగు నివ్వాలని ఆకాంక్షించారు రామచంద్ర యాదవ్. ముఖ్యంగా సంక్రాంతి అంటే రైతుల పండుగ, కావున సకాలంలో వర్షాలు కురిసి రైతులకు మంచి పంట పండాలని, మహిళందరికీ సౌభాగ్యం అందించాలని ఆకాంక్షించారు. సంక్రాంతి పండుగకు పుంగనూరులో ఒక ప్రత్యేకత ఉందన్నారు. సంక్రాంతి రోజు నుండి నెల రోజుల పాటు ఇక్కడి గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొని ఉంటుందని అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా తాము నిర్వహించిన ముగ్గుల పోటీకి వేలాది మంది ఆడపడుచులు, మహిళలు పాల్గొనడంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇంకా భారీ ఎత్తున పోటీలు నిర్వహించాలని భావించినప్పటికీ పుంగనూరు నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా ఈ ఏడాది ముగ్గుల పోటీలు మాత్రమే నిర్వహించడం జరిగిందన్నారు. ఆ కారణాలు ఏమిటి అనేది తాను ఇప్పుడు చెప్పదల్చుకోలేదని, అందరికీ తెలుసునని అన్నారు. వచ్చే ఏడాది భారీ ఎత్తున సంక్రాంతి సందర్భంగా పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. మహిళలకు ముగ్గుల పోటీలు, రైతులకు ఎద్దుల పోటీలు, యువతకు కబడ్డీ పోటీలను నిర్వహిస్తామని రామచంద్ర యాదవ్ చెప్పారు.
విజేతలకు బహుమతులు, కానుకలు : మొదటి బహుమతిగా ఏడుగురికి ఒక్కొక్కరికి రూ. 50,116లు చొప్పున బహుమతి అందజేశారు. పుంగనూరు మున్సిపాలిటీ పరిధిలో మొదటి బహుమతి వసంత కుమారి, పుంగనూరు రూరల్ మండలం నుండి జే లోహిత, చౌడేపల్లి మండలం నుండి ఆర్ కుసుమ, సోమల మండలం నుండి బి చిన్న రెడ్డమ్మ, సదుము మండలం నుండి డి అనసూయ, పులిచర్ల మండలం నుండి ఎం హేమలత, రొంపిచర్ల మండలం నుండి జి రెడ్డి రేణుక లకు మొదటి బహుమతి అందజేశారు. ఆ తర్వాత ద్వీతయ బహుమతి మండలానికి ముగ్గురు చొప్పున మొత్తం 21 మందికి రూ. 25,116లు చొప్పున, తృతీయ బహుమతి మండలానికి 9 చొప్పున మొత్తం 63 మందికి రూ.5,116లు చొప్పున నగదు బహుమతి అందజేశారు. అలానే పోటీలో పాల్గొన్న ప్రతి ఆడపడుచుకూ సంక్రాంతి ప్రత్యేక కానుకలు అందించారు.
పారదర్శకంగా నిర్వహణ : ఈ పోటీలను రామచంద్ర యాదవ్ వినూత్నంగా నిర్వహించారు. భోగి రోజు (ఈ నెల 14న) న మహిళలు వాళ్ల ఇంటి ముంగిట ఆకర్షనీయ ముగ్గు వేసి, ముగ్గుతో సెల్ఫీ దిగి, ఆ సెల్ఫీ మరియు వారి ఐడెంటిటీ కార్డుని మండలాల వారీగా ఇచ్చిన ఫోన్ నెంబర్ లకు వాట్సప్ ద్వారా పంపగా, విజేతలను ఎంపిక చేశారు.