కొవ్వూరు : ఆంధ్రప్రదేశ్లో రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారని రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. దీనిలో భాగంగానే కొవ్వూరు నుంచి తమను గోపాలపురం నియోజకవర్గానికి, గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావును కోవ్వూరు నియోజకవర్గానికి మార్పులు చేస్తూ ఇన్ చార్జ్ లుగా నియమించారన్నారు. శనివారం కొవ్వూరు క్యాంపు కార్యాలయంలో జరిగిన ద్వారకా తిరుమల మండలం ఎంపీపీ వెంకన్నబాబు ఆధ్వర్యంలో 30 కార్లతో వచ్చిన నాయకులు మర్యాద పూర్వకంగా కలిసిన వేళ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే సందర్భంలో కొవ్వూరు నియోజకవర్గానికి చెందిన నాయకులు బాధాతప్త హృదయంతో వీడ్కోలు పలకడం గమనార్హం.. ఈ సందర్భంగా హోంమంత్రి పదవిలో పుట్టినిల్లు అయిన గోపాలపురం నియోజకవర్గానికి పంపిస్తున్నామని.. రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించి హోంమంత్రి పదవికి మించిన స్థాయిలో ఆశీర్వదించాలని కొవ్వూరు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు కోరారు.
ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ రాజకీయాలు, పదవులు శాశ్వతం కాదని, చేసిన మంచి పనులు మాత్రమే శాశ్వతమన్నారు. కష్టకాలంలో వెన్నంటి ఉన్న నాయకులు, కార్యకర్తల అందించిన తోడ్పాటు, సేవలు ఎన్నటికీ మర్చిపోలేమన్నారు. అందరి ఆదరాభిమానాలు ఎప్పటికీ అలాగే ఉండాలని కోరుతూ కృతజ్ఞతలు తెలిపారు. కొవ్వూరు, గోపాలపురం నియోజకవర్గాలతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేశారు. 2012లో వైఎస్సార్సీపీలో జాయిన్ అయ్యి 2013లో కొవ్వూరు నియోజకవర్గానికి వచ్చామని గుర్తు చేశారు. నియోజకవర్గాల్లో అక్కడక్కడా చిన్న చిన్న మనస్పర్థలు ఉన్నా అంతిమంగా పార్టీని గెలిపించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. వై నాట్ 175 నినాదంతో ముందుకెళ్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఇప్పుడున్న సిట్టింగుల పని తీరుపై పలు సంస్థలతో సర్వేలు నిర్వహించి వాటి ఫలితాల ఆధారంగా అభ్యర్థుల విషయంలో మార్పులు చేశారన్నారు. జగనన్న తీసుకున్న నిర్ణయంతో అందరూ ఏకీభవించి అందరూ సమిష్టి కృషి చేసి గోపాలపురం నుంచి తనను, కొవ్వూరు నియోజకవర్గం నుంచి తలారి వెంకట్రావు గెలిపించాలని హోంమంత్రి తానేటి వనిత కోరారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు, గోపాలపురం నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.