హైదరాబాద్: ఈనెల 25 నుంచి ఉప్పల్ స్టేడియంలో జరగనున్న భారత్-ఇంగ్లండ్ తొలి టెస్టు మ్యాచ్‌కు విచ్చేయాల్సిందిగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్రావు ఆహ్వానించారు. రాజ్‌భవన్‌లో ఆమెను కలిసిన జగన్మోహన్రావు ఆహ్వాన పత్రికను అందించారు. ఈ సందర్భంగా హెచ్‌సీఏ నూతన కార్యవర్గ సభ్యులను తమిళిసైకు జగన్మోహన్రావు పరిచయం చేశారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగుల కుటుంబాలను మ్యాచ్‌కు ఉచితంగా అనుమతించడం, ఇతరత్ర ఏర్పాట్లు గురించి ఆమెకు జగన్మోహన్ రావు వివరించారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ మ్యాచ్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు కష్టపడి పని చేయాలని, అభిమానులకు ఎలాంటి లోటు పాట్లు కలగకుండా అద్భుతంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ భేటీలో హెచ్‌సీఏ ఉపాధ్యక్షుడు దల్జిత్ సింగ్, కోశాధికారి సీజే శ్రీనివాస్, సహాయ కార్యదర్శి బసవరాజు, కౌన్సిలర్ సునిల్ పాల్గొన్నారు.