జాతీయస్థాయిలో మూడో స్థానంలో ఎపి * ఈనెల 23న భోపాల్ లో అవార్డు ప్రధానం * మైనింగ్ రంగంలో సీఎం వైయస్ జగన్ సంస్కరణలతోనే ఇది సాధ్యం * పారదర్శక విధానాలతో అత్యుత్తమ ఫలితాలు * జాతీయ అవార్డుపై అధికారులకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అభినందనలు
అమరావతి : ముఖ్యమంత్రి వైయస్ జగన్ మైనింగ్ రంగంలో తీసుకువచ్చిన సంస్కరణలు మంచి ఫలితాలను అందిస్తున్నాయి. అవినీతిని నియంత్రించడం, పారదర్శక విధానాలతో మైనింగ్ రంగాన్ని ప్రోత్సహించేందుకు తీసుకున్న చర్యలు జాతీయ స్థాయిలో రాష్ట్రాన్ని మూడో స్థానంలో నిలిపాయి. రాష్ట్రంలో మేజర్ మినరల్ బ్లాక్ లకు నిర్ధిష్ట కాలపరిధిలో గనులశాఖ ఆక్షన్ నిర్వహించేందుకు తీసుకున్న చర్యలను కేంద్ర గనుల మంత్రిత్వశాఖ గుర్తించింది. ఏడాది కాలంలోనే 11 బ్లాక్ లకు ఆక్షన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన రాష్ట్రప్రభుత్వానికి జాతీయ అవార్డును ప్రకటించింది. మైనింగ్ రంగంలో పారదర్శకతను పెంచేందుకు కేంద్రప్రభుత్వం 12.01.2015న మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్ మెంట్ అండ్ రెగ్యులేషన్ చట్టం 1957 కు సవరణలు తీసుకువచ్చింది. ఈ సవరణల తరువాత దేశ వ్యాప్తంగా 336 మేజర్ మినరల్ బ్లాక్ లకు రాష్ట్రప్రభుత్వాలు ఆక్షన్ నిర్వహించాయి. 2022-23లో దేశ వ్యాప్తంగా అత్యధికంగా మొత్తం 105 మేజర్ మినరల్ బ్లాక్ లకు ఆక్షన్ నిర్వహించడం జరిగింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 11 మేజర్ మినరల్ బ్లాక్ లకు ఆక్షన్ నిర్వహించింది. దేశవ్యాప్తంగా మేజర్ మినరల్స్ బ్లాక్ లకు విజయవంతంగా ఆక్షన్ ప్రక్రియను పూర్తి చేసిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచింది. ఈ మేరకు కేంద్రప్రభుత్వం ఎపికి ‘అవార్డ్ ఆఫ్ అప్రిసియేషన్’ ను ప్రకటించింది. ఈ నెల 23వ తేదీన భోపాల్ లో జరిగిఏ రెండో స్టేట్ మైనింగ్ మినిస్టర్స్ కాన్ఫెరెన్స్ లో ఈ అవార్డును అందచేయనున్నట్లు రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ (మైన్స్) గోపాలకృష్ణ ద్వివేదికి కేంద్ర గనుల మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి డాక్టర్ వీణా కుమారి డెర్మల్ రాసిన అధికారిక లేఖలో ప్రకటించారు. ముఖ్యమంత్రి జగన్ గనులశాఖలో అమలు చేస్తున్న సంస్కరణల్లో భాగంగా మైనింగ్ రంగంలో రాష్ట్రం సాధించిన ప్రగతికి ఈ అవార్డు నిదర్శనంగా నిలుస్తోందని, ఇందుకు గానూ కృషి చేసిన గనులశాఖ స్పెషల్ సీఎస్ గోపాలకృష్ణ ద్వివేది, గనులశాఖ రాష్ట్ర సంచాలకులు వి.జి వెంకటరెడ్డిని రాష్ట్ర భూగర్భగనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అభినందించారు.