గుంటూరు : జిల్లాల వారీగా 2024 ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. తుది ఓటర్ల జాబితాలను సీఈఓ ఆంధ్రా వెబ్ సైట్ లో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం పొందుపరిచింది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాలను ప్రచురించింది. నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాలను పీడీఎఫ్ అప్ లోడ్ చేసింది. ఓటర్ల జాబితాలను ఎక్కడికక్కడే విడుదల చేయాలని ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు ఇచ్చారు. 2024 తుది ఓటర్ల జాబితాను రాజకీయ పార్టీలకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి మీనా అందజేశారు.
తుది జాబితాలో కూడా తప్పులు దొర్లితే : గత ఏడాది అక్టోబర్ 27న విడుదలైన ముసాయిదా జాబితా పై విమర్శలు వెల్లువెత్తాయి. జీరో డోర్ నెంబర్ తో ఓట్లు, డూప్లికేట్ ఓట్లు పై పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని తుది ఓటర్ ల జాబితాలో మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివరించారు. తుది జాబితాలో కూడా తప్పులు దొర్లితే అధికారులపై ఎలాంటి చర్యలు ఉంటాయో అని ఆందోళన వ్యక్తం అవుతోంది. తిరుపతి ఉప ఎన్నికల్లో ఓటరు గుర్తింపు కార్డులను డౌన్లోడ్ చేసి నకిలీ ఎపిక్ కార్డ్ లు సృష్టించడం పై ఈసీ సీరియస్ అయ్యింది. ఈ వ్యవహారంలో ఓ జిల్లా కలెక్టర్ తో పాటు మరింత మంది అధికారులను ఇప్పటికే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఓటర్ల తుది జాబితాపై రాజకీయ పార్టీలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.
పెండింగ్ లో 17వేల దరఖాస్తులు : అనంతపురం జిల్లాలో మొత్తం 19లక్షల 94వేల 5వందల 44 మంది ఓటర్లు ఉన్నట్లు జిల్లా కలెక్టర్ గౌతమి తెలిపారు. ఎలక్షన్ కమిషన్ విడుదల చేసిన ఓటర్ జాబితాను ఆమె వెల్లడించారు. ఇప్పటికీ 17వేల దరఖాస్తుల పెండింగ్ లో ఉన్నాయని వాటిని సరి చేయడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నామినేషన్ ప్రక్రియ వరకు కొత్త ఓట్లు నమోదుకు అవకాశం ఉంటుందన్నారు. అనంతపురం జిల్లాలో ఫాల్స్ ఓట్ల నమోదు ప్రక్రియకు సంబంధించి ఐదు చోట్ల కేసులు నమోదైనట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు. రాప్తాడులో మూడు, కళ్యాణదుర్గం లో ఒకటి, అనంతపురం అర్బన్ లో ఒకటి కేసు నమోదైనట్లు తెలిపారు. వీటి వివరాలను త్వరలో వెల్లడిస్తామన్నారు. డబల్ ఎంట్రీ ఓట్లు, మృతి చెందిన వారి ఓట్లు, ఇతర కారణాల వల్ల ఓట్లు తొలగించమని వచ్చిన దరఖాస్తులను పూర్తిగా పరిశీలించి వాటిని తొలగించి ఇవాళ తొలి జాబితాను వెల్లడించామన్నారు.