పురుషులు 2,00,09,275…మహిళలు 2,07,37,065 మంది
థర్డ్ జెండర్స్ 3,482..సర్వీస్ ఓటర్లు 67,434 మంది
ఏపీలో 2024 ఓటర్ల తుది జాబితా విడుదల
ఏపీలో 14 లక్షల ఫిర్యాదులు..5.6 లక్షల ఓట్ల తొలగింపు
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ముకేశ్‌కుమార్ మీనా
వెలగపూడి : ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఓటర్ల తుది జాబితాను జిల్లాల వారీగా కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. సీఈవో ఆంధ్ర వెబ్సైట్లో జిల్లాల వారీగా తుది ఓటర్ల జాబితాను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొంది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాలు వెబ్సైట్లో అప్లోడ్ చేసినట్లు తెలిపింది. జాబితాను ఎక్కడికక్కడే ప్రదర్శించాలని కలెక్టర్లకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో మొత్తం 4,08,07,256 ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 2,00,09,275 మంది ఉండగా మహిళలు 2,07,37,065 మంది ఉన్నారు. థర్డ్ జెండర్స్ 3,482.. సర్వీస్ ఓటర్లు 67,434 మంది ఉన్నారు.
ఎన్నికల సన్నద్ధతపై సీఎస్ సమీక్ష : ఎన్నికల సన్నద్ధతపై సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జవహర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అధికారుల బదిలీల వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఈసీ ఆదేశించిన నేపథ్యంలో జనవరి 31లోగా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బంది బదిలీలపై సమీక్షించారు. పోలింగ్ కేంద్రాల్లో కల్పించాల్సిన సౌకర్యాలు, సిబ్బంది ఖాళీలు తదితర అంశాలపైనా సీఎస్ చర్చించారు. ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా, పోలీసు ఉన్నతాధికారులు, అదనపు సీఈఓలు సమావేశానికి హాజరయ్యారు.
ఏపీలో 14 లక్షల ఫిర్యాదులు.. 5.6 లక్షల ఓట్ల తొలగింపు : ముసాయిదా జాబితా కంటే తుది జాబితాలో ఓటర్ల సంఖ్య పెరిగిందని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ముకేశ్‌కుమార్ మీనా తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం తుది ఓటర్ల జాబితా విడుదల చేసినట్లు చెప్పారు. అక్టోబర్ 27న జారీ చేసిన ముసాయిదా జాబితా అనంతరం 5.8 లక్షల మంది ఓటర్లు పెరిగారని పేర్కొన్నారు. యువ ఓటర్లు సైతం 5 లక్షల మేర పెరిగారని వెల్లడించారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆగస్టు 2023లో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్రంలో పర్యటించారు. ఆ సమయంలో రెండు ప్రధాన సమస్యలు వారి దృష్టికి వచ్చాయి. తప్పుడు అడ్రస్‌లు, అసలు చిరునామా లేకుండా, ఒకే ఇంట్లో పదికి మించి ఓటర్లు ఉండటం, ఇలా పలు సమస్యలు వారి దృష్టికి వచ్చాయి. వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాం. చిరునామా లేకుండా 2.51 లక్షల మంది ఉన్నట్లు గుర్తించామన్నారు. 10 కంటే ఎక్కువ ఓటర్లు కలిగిన 1.51 లక్షల ఇళ్లను తనిఖీ చేసి 25లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు గుర్తించాం. కొన్నిచోట్ల ఒకే చిరునామాతో 700మందికిపైగా ఉన్నారు. ఈ సమస్యను 98 శాతం మేర సరిచేశాం. కొన్ని అంశాల్లో సాంకేతిక కారణాలతో పూర్తి స్థాయిలో సవరణ చేయలేకపోయాం. 14 లక్షల ఓటర్లకు సంబంధించి రాజకీయ పార్టీలు ఫిర్యాదులు ఇచ్చాయి. వాటిని పరిశీలించి 5.6 లక్షల ఓట్లను తొలగించాం. కొందరు దురుద్దేశపూర్వకంగా ఫారం-6, ఫారం-7 నమోదు చేశారు. అలాంటివారిపై 70 కేసులు నమోదు చేశాం. కొత్త దరఖాస్తులపైనా సమీక్ష చేస్తాం. 80 ఏళ్ల వయసు పైబడిన వారి ఇళ్లకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటాం. ఈ తరహా ఓటర్లు రాష్ట్రంలో 4.70 లక్షల మంది ఉన్నారు. ఓటర్ల జాబితాలో ఫిర్యాదులు అభ్యంతరాలపై సీఈఓ కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశాం. ఓటరు తుది జాబితాను అన్ని పంచాయతీ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచుతామని ముకేశ్ కుమార్ మీనా తెలిపారు.