బి సి సంఘాల నేతలు హర్షం
విజయవాడ : బీసీ సామాజిక వర్గాల అభ్యున్నతి ఎనలేని కృషిచేసిన బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌కు భారతదేశ అత్యున్న పురస్కారం భారతరత్న ప్రకటించడం మొత్తం బీసీ వర్గాలకు గర్వ కారణమని పలువురు బీసీ నేతలు వ్యాఖ్యానించారు. నగరంలోని నాయీబ్రాహ్మణ సంక్షేమ సంఘం కార్యాలయంలో బుధవారం జరిగిన కర్పూరీ ఠాకూర్ శత జయంతివేడుకల ప్రారంభం సందర్భంగా సంక్షేమ సంఘం అధ్యక్షులు మల్కాపురం కనకారావు అధ్యక్షత వహించారు. ఠాకూర్ చిత్రపటానికి పూలమాల వేసిన అనంతరం కనకరావు మాట్లాడుతూ భారతదేశం గర్వించతగిన బీసీ నేత కర్పూరీ టాకూరు భారతరత్న ప్రకటించడం పట్ల ప్రధాన మంత్రి నరేంద్రమోడి కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడ బీసీ సంఘం ఉపాధ్యక్షులు దాలిపర్తి ధన్వంతరీ మాట్లాడుతూ 1978లో బీసీ నాయకులు కీర్తి శేషులు కొనకళ్ల గణపతి కోరిక మేరకు కర్పూరీ ఠాకూర్ విజయవాడ, మచిలీపట్నం సందర్శించినప్పుడు వారికి స్వాగతం పలికి వారితోపాటు పర్యటించడం తన అదృష్టమన్నారు. ఆ సందర్భంగా వారి దుస్తులనే ఆయన ఉతుక్కోవడం ప్రత్యక్షంగా చూశానంటూ ఠాకూర్ సింప్లిసిటీ గురించి వివరించారు. ఎ.పి. బీసీ సంక్షేమ సంఘం విజయవాడ అధ్యక్షులు మేకా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఠాకూర్ జాతీయ స్థాయి నాయకులని ఆయనను ఒక కులానికో, ఒక వర్గానికి పరిమితం చేయకూడదని అన్నారు. సీనియర్ పాత్రికేయులు సిహెచ్.వి.వి. సత్యనారాయణ మాట్లాడుతూ విజయవాడ నగరంలో అన్ని వర్గాల ప్రమేయంలో కర్పూరీ ఠాకూర్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాల్సిన అవసరం వుందన్నారు. నాయీబ్రాహ్మణ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎపి జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్నవరపు బ్రహ్మయ్య మాట్లాడుతూ బీహార్ ముఖ్యమంత్రిగా 1978లో ఉత్తరాది రాష్ట్రాలలో బీసీ వర్గాలకు రిజర్వేషన్లు ఏర్పాటు చేసిన ఘనత ఠాకూర్‌కే దక్కుతుందన్నారు. నగరంలోని సోషలిస్టులు, బీసీ ప్రముఖలతో కలసి ఏడాది పొడవునా ఠాకూర్ శత జయంతి వేడుకలు జరపడానికి నిర్ణయించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలు నాయీబ్రాహ్మణ, బీసీ సంఘాల నేతలు రాయపాటి గణపతి, కాపవరపు నాగ సుధాకర్, రిమ్మనపూడి బ్రహ్మేశ్వరరావు, గుంటుపల్లి ఉమామహేశ్వరరావు, చెరుకుపల్లి రమణ, తెన్నేటి సోము తదితరులు పాల్గొన్నారు.