తిరుపతి : రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్, ఎక్స్ అఫిషియో కార్యదర్శి టి.విజయ్ కుమార్ రెడ్డి బుధవారం జిల్లా కలెక్టరేట్ లోని జిల్లా సమాచార శాఖ కార్యాలయంను ఆకస్మికంగా తనిఖీ చేసారు. కమిషనర్ జిల్లా సమాచారశాఖ అధికారులతో, సిబ్బందితో సమావేశమయ్యారు. జర్నలిస్ట్ హౌసింగ్ స్కీమ్ ఉత్తర్వులు అందిన తర్వాత జిల్లా అక్రిడేషన్ కమిటీ సమావేశం నిర్వహించారా లేదా అని ఆరా తీశారు. అలాగే ప్రస్తుత హౌసింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న వివరాలను పరిశీలించారు. జర్నలిస్ట్ హౌసింగ్ కమిటీ సమావేశాలు నిర్వహించి త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని మరో మారు అన్ని జిల్లాలకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. సమాచార శాఖ అధికారులు వివరిస్తూ ఈనెల 3 న జిల్లా అక్రిడేషన్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించామని ఇప్పటివరకు జిల్లాలో 666 అర్హత కలిగిన మీడియా ప్రతినిధులకు అక్రిడేషన్లను అందించామని , జర్నలిస్ట్ హౌసింగ్ స్కీమ్ సంబంధించి ఇప్పటికే ఈ కార్యాలయానికి అందిన దరఖాస్తులు 583 జిల్లాలోని రెవిన్యూ డివిజనల్ అధికారులకు పరిశీలన నిమిత్తం పంపించడం జరిగిందని వివరించారు. జిల్లా కలెక్టర్ వారు ఇప్పటికే రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేసి ఉన్నారని ఆ మేరకు పురోగతిలో ఉందని వివరించారు. కమిషనర్ పర్యటనలో డిపిఆర్ఓ విజయ సింహారెడ్డి, ఎపిఓ, చిత్తూరు వెంకటరమణ, డివిజనల్ పిఆర్ఓ ఈశ్వరమ్మ, సమాచార శాఖ సిబ్బంది పాల్గొన్నారు.