నాయకులకు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేయనున్న సీఎం జగన్
వైఎస్సార్సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి
శ్రీకాకుళం : వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజియన్ పరిధిలోని నాయ కులు, ప్రజా ప్రతినిధులను రానున్న ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు ఈ నెల 27వ తేదీన భీమిలి నియోజకవర్గంలోని సంగివలసలో సభ నిర్వహించనున్నట్లు పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ సభలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొని నాయకులు, ప్రజాప్రతినిధులకు దిశా నిర్దేశం చేయడం ద్వారా భీమిలి నుంచి ఎన్నికల శంఖారావానికి శ్రీకారం చుడతారని వెల్లడించారు. గురువారం శ్రీకాకుళం జిల్లా వైస్సార్సీపీ కార్యాలయం ఆవరణలో జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అధ్యక్షతన జరిగిన సన్నాహక సమావేశంలో రీజనల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులకు మరోసారి తెలియజేసి వారిని ఉత్తేజితులను చేయడమే ఈ సభ ఉద్దేశమని చెప్పారు. ఈ సభలో ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఐదు వేలు చొప్పున రెండు లక్షల మంది వరకు ప్రజాప్రతినిధులు, గృహ సారథులకు స్థానం కల్పించనున్నట్లు తెలిపారు. ఇలాంటి సభలే రాష్ట్ర వ్యాప్తంగా మరో నాలుగుచోట్ల నిర్వహిస్తామన్నారు.
వైస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ సీఎం జగన్ ఉత్తరాంధ్ర నుంచే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చూడుతుండడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ ఎన్నికల్లో కూడా విజయం మనదేనని అందువల్ల మరింత ఉత్సాహంతో పార్టీ శ్రేణులు ఈ సమావేశంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా ఇంఛార్జి మంత్రి వర్యులు బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఈ సభ చారిత్రాత్మకంగా నిలిచిపోయేలా విజయవంతం చేయాలన్నారు. ఈ సన్నాహక సమావేశంలో ఎంఎల్సీ నర్తు రామారావు, ఇచ్చాపురం నియోజకవర్గ సమన్వయకర్త పిరియా విజయ, బీసీ సెల్ జోనల్ ఇంచార్జ్ డాక్టర్ ధర్మాన కృష్ణచైతన్య, శాసన సభ్యులు రెడ్డి శాంతి, గొర్లె కిరణ్ కుమార్, శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ ఇంచార్జ్ పేరాడ తిలక్, బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు మామిడి శ్రీకాంత్, అంధవరపు సూరిబాబు, రాజాపు హైమవతి అప్పన్న, సుడా చైర్మన్ కోరాడ ఆశాలత గుప్త, ఎంపీపీ ఆరంగి మురళి, డిసిసిబి అధ్యక్షుడు కరిమి రాజేశ్వరరావు, యువనేతలు ధర్మాన రామమనోహర్ నాయుడు, తమ్మినేని చిరంజీవి నాగ్ తదితరులు పాల్గొన్నారు.