టీ20 వరల్డ్ కప్‌లో సెమీస్ కు బెర్తులు ఖరారయ్యాయి. చివరి మ్యాచ్‌లో జింబాబ్వేపై బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణించి 71 పరుగుల తేడాతో ఘనవిజయం అందుకున్న భారత్ గ్రూప్-2 పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. దీంతో గ్రూప్-1 పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో నిలిచిన ఇంగ్లండ్‌తో నాకౌట్ మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. నవంబర్ 10,2022 (గురువారం) మధ్యాహ్నం 1:30 గంటలకు ఈ మ్యాచ్ మొదలవనుంది. ఇక గ్రూప్-1 పాయింట్స్ టేబుల్లో టాప్‌లో నిలిచిన న్యూజిలాండ్, గ్రూప్-2లో 2వ స్థానంలో ఉన్న పాకిస్తాన్ మధ్య అక్టోబర్ 9న మొదటి సెమీస్ పోరు జరగనుంది.
ఇక జింబాబ్వేపై మ్యాచ్ విషయానికి వస్తే భారత పేసర్లు విజృంభించారు. తక్కువ స్కోరుకే కీలకమైన వికెట్లు తీసి జింబాబ్వేని కోలుకోలేని దెబ్బకొట్టారు. దీంతో 17.2 ఓవర్లు ఆడి 115 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆరంభంలో పరుగులు నియంత్రించడంలో సఫలమైన భువనేశ్వర్ కుమార్, హర్షదీప్ సింగ్ చెరో వికెట్ తీసి ఇతర బౌలర్లలో విశ్వాసాన్ని నింపారు. ఆ తర్వాత ఎటాక్‌కు దిగిన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు, పేసర్లు మహ్మద్ షమీ, హార్ధిక్ పాండ్యా చెరో 2 వికెట్లు, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశారు. టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించిన సూర్యకుమార్ యాదవ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డ్’ దక్కింది. కాగా, తొలుత టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ప్రత్యర్థికి 187 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. బంగ్లాదేశ్‌పై అర్ధసెంచరీ కొట్టిన కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్‌లోనూ 51 పరుగులతో రాణించాడు.
25 బంతుల్లో 61 పరుగులు కొట్టిన సూర్యకుమార్ యాదవ్ భారత్ భారీ స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. హార్ధిక్ పాండ్యాతో కలిసి చక్కటి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 4 సిక్సర్లు, 6 ఫోర్లతో జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడిన సూర్య నాటౌట్‌గా నిలిచాడు. కాగా, కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి నిరాశపరిచాడు. వ్యక్తిగత స్కోరు 15 పరుగుల వద్ద ఔటయ్యాడు. విరాట్ కోహ్లీ 26 పరుగులతో ఫరవాలేదనిపించాడు. ప్రస్తుత వరల్డ్ కప్ భారత జట్టులో తొలిసారి చోటు దక్కించుకున్న రిషబ్ పంత్ విఫలమయ్యాడు. 5 బంతులు ఎదుర్కొని 3 పరుగులు మాత్రమే కొట్టాడు. ఆ తర్వాత హార్ధిక్ పాండ్యా (18), అక్షర్ పటేల్(0 నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లు ఆరంభంలో భారత బ్యాట్స్మెన్లను కట్టడి చేసినట్టే కనిపించారు. కానీ భారత బ్యాట్స్‌మెన్ స్పీడ్ పెంచడంతో పరుగుల వేగాన్ని అడ్డుకోలేకపోయారు. సీన్ విలియన్స్ 2 వికెట్లు తీయగా.. గరవా, ముజరబని, సికందర్ రజా తలో వికెట్ తీశారు.