హైదరాబాద్: జనవరి 27 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా శాసనసభ నియోజకవర్గాల వారీగా పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించనున్నట్లు భారత రాష్ట్ర సమితి (భారాస) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఈ సమావేశాలు నిర్వహించనున్నామని, ఫిబ్రవరి 10వ తేదీలోగా పూర్తి చేయనున్నట్లు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలపై పూర్తిస్థాయి సమీక్షతో పాటు క్షేత్రస్థాయిలోని అంశాలపై విస్తృతంగా చర్చించనున్నట్లు తెలిపారు. లోక్సభ ఎన్నికలకు సంబంధించి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చిస్తామన్నారు. సమావేశాల నిర్వహణ బాధ్యత స్థానిక ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జిలు తీసుకుంటారని చెప్పారు. ఈనెల 27న సిద్దిపేట, బోథ్, జూబ్లీహిల్స్, వనపర్తి, నల్గొండ నియోజకవర్గాల్లో సమావేశాలుంటాయన్నారు. 28న సిరిసిల్ల, వర్ధన్నపేట, మెదక్, ముషీరాబాద్, పాలకుర్తి నియోజకవర్గాల్లో, 29న ఆలేరు, నర్సంపేట, ఖైరతాబాద్, జుక్కల్, ఆందోల్, వికారాబాద్, జగిత్యాల నియోజకవర్గాల్లో సమావేశాలు జరుగుతాయని వెల్లడించారు.