అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారత రాజ్యాంగ స్పూర్తికి అనుగుణంగా ప్రభుత్వ పాలన సాగడం చాలా సంతోషంగా ఉందని రాష్ట్ర శాసన మండలి అధ్యక్షులు కొయ్యే మోషేన్ రాజు పేర్కొన్నారు.75వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని శుక్రవారం రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ముందుగా జాతిపిత మహాత్మాగాంధీ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి మువ్వన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం 75వ గణతంత్ర దినోత్సవ వేడుకులను జరుపుకుంటున్న తరుణంలో రాష్ట్ర ప్రజలందరికీ హార్ధిక శుభాకాంక్షలు తెలిపారు. సుమరు 300 ఏళ్ళ పాటు బ్రిటిష్ వలస పానలకు చరమ గీతం పలికి సర్వసత్తాక ప్రజాస్వామ్య దేశంగా ప్రకటించబడిన శుభదినం నేడని అన్నారు.నేడు పరిపాలన ఇంత సాఫీగా సాగుతోందంటే అందుకు మన రాజ్యాంగం దాని స్పూర్తే కారణమని పేర్కొన్నారు. ముఖ్యంగా మన రాష్ట్రంలో రాజ్యాంగ స్పూర్తికి అనుగుణంగా అన్నివర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించే దిశలో పాలన సాగడం చాలా ఆనందంగా ఉందని చైర్మన్ మోషేన్ రాజు అన్నారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగిన మన దేశంలో అన్ని వర్గాల వారికి సమాన అవకాశాలను కల్పించి పాలన సాగించడం ప్రజాస్వామ్య స్పూర్తికి ఇదే ప్రత్యక్ష నిదర్శనం అన్నారు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు పలు సంక్షేమ పధకాలు అమలుతో పాటు విద్యా,వైద్య పరమైన సౌకర్యాలు పూర్తి స్థాయిలో అందించడం నిజమైన ప్రజాస్వామ్య స్పూర్తికి నిలువెత్తు నిదర్శనమన్నారు.
75వ గణతంత్ర దినోత్సవ వేళ విజయవాడలో రాజ్యాంగ నిర్మాత డా.బిఆర్ అంబేద్కర్ వారి 206 అడుగుల ఎత్తుతో కూడిన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి శాసన మండలి అధ్యక్షులు మోషేన్ రాజు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ సెక్రటరీ జనరల్ డా.పిపిపికె.రామాచార్యులు,ఉప కార్యదర్శులు విజయరాజు, సుబ్బరాజు,చీఫ్ మార్షల్ ఎ.మురళి, లీగల్ అడ్వయిజర్ ఎం.చంద్రశేఖర్, ఇతర అధికారులు ఉద్యోగులు, ఎస్పిఎఫ్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.