అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల విధులతో సంబంధం ఉన్న అధికారులు, సిబ్బంది బదిలీలను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఒకే చోట మూడేళ్ల సర్వీసు దాటిన ఉద్యోగులను బదిలీ చేయాలని ఈసీ ఆదేశించడంతో సర్కారు ఈ ప్రక్రియను చేపట్టింది. సొంత జిల్లాలో పనిచేస్తున్న వారు, ఒకే చోట మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారు, జూన్ 30 నాటికి మూడేళ్ల సర్వీసు పూర్తి అవుతున్న వారిని బదిలీ చేస్తూ ఆయా విభాగాల అధిపతులు ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల విధుల్లో అక్రమాలపై క్రమశిక్షణ చర్యలు పెండింగ్లో లేని అధికారులు, ఎలాంటి క్రిమినల్ కేసులు లేని వారిని పరిగణనలోకి తీసుకోవాలని ఈసీ సూచించింది. ఒకే జిల్లాలో పదోన్నతి పొందినా అంతకుముందు సర్వీసును కూడా పరిగణనలోకి తీసుకుంటున్నట్టు ఉత్తర్వుల్లో ప్రభుత్వం వెల్లడించింది. మున్సిపల్ శాఖలో 92 మందిని బదిలీ చేస్తూ ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై. శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. ఎక్సైజ్ శాఖలోనూ భారీ సంఖ్యలో బదిలీలు చేస్తూ ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 31లోగా బదిలీల ప్రక్రియను పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.