అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డిల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేది. పలు సందర్భాల్లో ఇద్దరూ ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు గుప్పించుకున్నారు. తాజాగా ఈరోజు అసెంబ్లీ ఆవరణలో మల్లారెడ్డి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను, రేవంత్ రెడ్డి మంచి మిత్రులమని… ఇద్దరం టీడీపీ నుంచి వచ్చిన వాళ్లమని చెప్పారు. తాను, రేవంత్ కలిస్తే తప్పేముందని అన్నారు. కీసర ఆలయం కార్యక్రమానికి ఆహ్వానించేందుకు రేవంత్ రెడ్డిని కలుస్తానని చెప్పారు. రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని అన్నారు.
గోవాలో ఇప్పటికే తాను ఒక హోటల్ కొన్నానని మల్లారెడ్డి చెప్పారు. గోవాలో రియలెస్టేట్ వ్యాపారం చేస్తానని తెలిపారు. హైదరాబాద్ లో రియలెస్టేట్ బిజినెస్ స్లో అయిందని చెప్పారు. మరోవైపు ఇటీవల కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన మల్లారెడ్డి… ఇదే తనకు చివరి టర్మ్ అని, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని తెలిపారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచానని.. ప్రజల ఆశీర్వాదంతో ఒకసారి మంత్రిగా చేశానని చెప్పారు. భవిష్యత్తులో రాజకీయాల్లో లేకపోయినా ప్రజాసేవ చేస్తానని తెలిపారు.