ఆదిలాబాద్: ఇంద్రవెల్లి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. అతి త్వరలోనే రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని ప్రకటించారు. త్వరలో లక్షమంది మహిళలకు అందిస్తామని చెప్పారు. అంతే కాకుండా.. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని త్వరలోనే అమలు చేస్తామన్నారు. అంతే కాకుండా.. ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటానని సీఎం రేవంత్ అన్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, గూడాలకు రోడ్లు, నాగోబా అభివృద్ధి కోసం పనులు ప్రారంభించామని పేర్కొన్నారు. అమర వీరుల కుటుంబాలకి రూ. 5 లక్షల ఇచ్చి అండగా నిలిచాం.. కేసీఆర్ 10 ఏళ్లలో ఆదివాసిల గురించి ఒక్క రోజైనా ఆలోచించావా అని ప్రశ్నించారు.
తోటల్లో అడవి పందులు పడి ఎలా విధ్వంసం చేస్తాయో, అలా రాష్ట్రాన్ని కేసీఆర్ వాళ్ల కుటుంబం చేసిందని సీఎం రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. మీరు నీళ్ళు ఇస్తే 65 వేల కోట్లు నిధులు ఎందుకు ఇవ్వాల్సి వచ్చేది అని ప్రశ్నించారు. నీ బిడ్డలు, నీ దోపిడీ, ఫార్మ్ హౌస్ ఎలా కట్టాలని ఆలోచించావు తప్పా.. ప్రజల కోసం ఆలోచించ లేదని మండిపడ్డారు. 7 వేల స్టాఫ్ నర్సుల ఉద్యోగాలు తాము ఇచ్చామన్నారు. నిరుద్యోగుల బాధ చూడలేక కోర్టుల్లో ఉన్న కేసుల్ని పరిష్కరించే ప్రయత్నం చేశామని తెలిపారు.15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.
రెండు నెలలు కాలేదు.. ఇప్పుడే 6 గ్యారంటీలు అమలు చేయలేదు అంటున్నారన్నారు. కడెం రిపేర్ చేస్తాం.. సదర్మాట్, కుప్టి నిర్మిస్తామని తెలిపారు. ఈ ప్రాంతానికి ఎప్పుడైనా వచ్చావా అని కేసీఆర్ ను ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని పడగొడుతా అంటున్నారు.. ఎవ్వడు వచ్చేది.. ప్రజల ప్రభుత్వం తమది ప్రజా ప్రభుత్వం అని అన్నారు. కాళేశ్వరం గాలికి పోయింది.. నువ్వు నీ ఖాన్ దాన్ వచ్చినా ఏం చేయలేరని మండి పడ్డారు. జన్మలో మళ్లీ కేసీఆర్ సీఎం కాలేడని విమర్శించారు.
మతం పేరుతో ఒకరు.. మద్యం పేరుతో మరొకరు వస్తారు.. ప్రతీ తండా, గూడెం లలో రోడ్లు వేసే బాధ్యత తమదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటే ఆదిలాబాద్ ఎంపీ సీటు గెలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.