ఫిబ్రవరి 3న భువనేశ్వర్ లో సమావేశం
అమరావతి : నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్స్ ఇన్ ఇండియా (భారత సమాచార కమిషన్ ల జాతీయ సమాఖ్య) బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ 29వ సమావేశానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషన్ చీఫ్ కమిషనర్ ఆర్.
మహబూబ్ బాష హాజరు అవుతున్నారు. ఒడిషా లోని భువనేశ్వర్ లో ఫిబ్రవరి వ తేదీన ఈ సమావేశం
జరుగనుంది. జాతీయ సమాఖ్యలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషన్ కు తొలి నుంచీ సాధారణ సభ్యత్వం ఉన్నప్పటికీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ లో స్థానం లేదు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సమాచార కమిషన్ కు చీఫ్ కమిషనర్లుగా గతంలో పనిచేసిన సి.డి. అర్హ, జన్నత్ హుస్సెన్ (ఐఏఎస్ మాజీ అధికార్లు) బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ లో దక్షిణాది రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహించేవారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషన్ చీఫ్
కమిషనర్ కు ఈ అరుదైన అవకాశం లభించింది. గత ఏడాది సెప్టెంబర్ 2వ తేదీన విశాఖపట్నం లో జరిగిన
సమాఖ్య వార్షిక జాతీయ సమావేశాలలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషన్ చీఫ్ కమిషనర్ ను బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ లో దక్షిణాది రాష్ట్రాల (ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ) ప్రతినిధిగా ఎన్నుకున్నారు. మారుమూల ప్రాంతాలలో ఉంటున్న వారికి వర్చువల్/హైబ్రిడ్ విధానం ద్వారా అప్పీలు దారులు/ఫిర్యాదు దారుల సమాచార కమిషన్ లలో జరిగే తమ కేసుల ఫిర్యాదుల విచారణలో పాల్గొనేందుకు అవకాశం కల్పించాలని, ఈ-ఫైలింగ్ ద్వారా అప్పీళ్ళు, ఫిర్యాదులు, దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని దేశంలోని సర్వోన్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు అమలుకు దేశంలోని ఆయా కమిషన్ లు తీసుకుంటున్న చర్యలు పురోగతిలో ఉన్న
ప్రస్తుత నేపథ్యంలో భువనేశ్వర్ లో జరిగే ప్రస్తుత సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఎన్.ఎఫ్.ఐ.సి.ఐ అధ్యక్షులు,
కేంద్ర సమాచార కమిషన్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ హీరాలాల్ సమారియా బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశానికి
అధ్యక్షత వహిస్తారు. ఉత్తరా ఖండ్ రాష్ట్ర సమాచార కమిషన్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్, సమాఖ్య ఉపాధ్యక్షులు అనిల్ చంద్ర పునేఠ తో పాటుగా మరో ఐదుగురు చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ లు గవర్నర్ ల హోదాలో ఈ సమావేశంలో పాల్గొంటారు. అయా రాష్ట్రాలలో వివిధ సమాచార కమిషన్ లు సమాచార హక్కును అమలు
చేయటంలో ఎదుర్కొంటున్న అనుభవాలను, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన అనేక అంశాలను ఈ సమావేశంలో చర్చిస్తారు.