ధార్మిక సదస్సులో టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకర రెడ్డి
తిరుమల : మఠాధిపతులు, పీఠాధిపతుల సలహాలు, సూచనలతో సనాతన హిందూ ధర్మప్రచారాన్ని మరింత గొప్పగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ధార్మిక సదస్సు నిర్వహిస్తున్నట్టు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర రెడ్డి తెలిపారు. తిరుమల ఆస్థాన మండపంలో శనివారం శ్రీ వేంకటేశ్వర ధార్మిక సదస్సు వైభవంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా భూమన కరుణాకర రెడ్డి ప్రారంభోపన్యాసం చేశారు. భారతదేశం పవిత్రభూమి అని, ఇక్కడే వేదాలు ఆవిర్భవించాయని, సాక్షాత్తు విష్ణుమూర్తి వారు శ్రీరామ, శ్రీకృష్ణ రూపాల్లో అవతరించారని చెప్పారు. ఈ దేశంలోనే ధర్మాచరణకు దిక్సూచిగా తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారు స్వయంభువుగా అవతరించారని అన్నారు. స్వామివారి ఆశీస్సులతో అనేక ధార్మిక, ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వివరించారు. హిందూ ధర్మాన్ని మరింత విస్తృతంగా ప్రచారం చేయడంలో భాగంగా పీఠాధిపతులు, స్వామీజీలు, భావసారూప్యం గల ఇతర హిందూ మత సంస్థల నిర్వాహకుల నుండి సముచితమైన సూచనలను, సలహాలను స్వీకరిస్తామన్నారు. తాను తొలిసారి ఛైర్మన్ గా ఉన్న సమయంలో రెండు సార్లు ధార్మిక సదస్సులు నిర్వహించి పీఠాధిపతులు, మఠాధిపతుల సూచనలు, సలహాలను స్వీకరించి దళిత గోవిందం, మత్స్య గోవిందం, గిరిజన గోవిందం లాంటి కార్యక్రమాల ద్వారా భగవంతుడిని భక్తుల చెంతకు తీసుకెళ్లామని చెప్పారు. స్వామివారికి సంకీర్తనల సేవ అందించిన శ్రీ అన్నమాచార్యులు, శ్రీ పురందరదాసు, శ్రీ కనకదాసు, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ పేర్లతో ప్రాజెక్టులు నిర్వహిస్తున్నామని చెప్పారు. స్వామీజీల సూచనలతోనే ఎస్వీబీసీ ఛానల్ ఏర్పాటు చేసి ధర్మ ప్రచారానికి కొత్త అధ్యాయం ప్రారంభించామని గుర్తు చేశారు. వేద పరిరక్షణ కోసం వేద విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశామన్నారు. సనాతన హిందూ ధర్మ ప్రచారాన్ని చిత్త శుద్ధితో ప్రజలకు చేరువ చేస్తున్న టీటీడీపై అవాస్తవ విమర్శల దాడి జరుగుతోందని కరుణాకర రెడ్డి స్వామీజీలకు విన్నవించారు. మీ ఆశీస్సులతో, సలహాలు, సూచనలను శాసనంగా భావించి టీటీడీ ధర్మ ప్రచారానికి పునరంకితం అవుతుందని ఆయన స్వామీజీలకు విన్నవించారు. తమ వైపు నుంచి ఏవైనా పొరబాట్లు జరిగి ఉంటే తగిన సూచనలు, సలహాలు ఇస్తే వాటిని సవరించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సు సోమవారం ముగియనుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి పీఠాధిపతులు, మఠాధిపతులు హాజరయ్యారు.