జరిగిన మంచిని వంద మందికి చెప్పాలి
57 నెలలో మీ బిడ్డ 124 సార్లు బటన్ నొక్కాడు
ఆ అక్క చెల్లెమ్మలే మన స్టార్ క్యాంపెయినర్లు
ఏలూరు జిల్లా దెందులూరులో నిర్వహించిన సిద్ధం బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి
ఏలూరు జిల్లా దెందులూరు : వచ్చే ఎన్నికలు పేదల భవిష్యత్తును నిర్ణయించేవని, జరిగిన మంచిని వంద మందికి చెప్పాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ కేడర్‌కు పిలుపు ఇచ్చారు. శనివారం ఏలూరు జిల్లా దెందులూరులో నిర్వహించిన సిద్ధం బహిరంగ సభకు హాజరైన వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానుల్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఎన్నికలప్పుడు కొందరు వాగ్దానాలు చేస్తారు..మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత చెత్త బుట్టలో పడేస్తారు. అది వాళ్లకు అలవాటైన పనే. అయితే 99 శాతం హామీల అమలుతో మేనిఫెస్టోకు విశ్వసనీయత తీసుకొచ్చేందే మీ జగన్. వైఎస్సార్సీపీ ప్రభుత్వం. కళ్లుండి ఈర్ష్యతో చూడలేని కబోదిలు ఏమంటున్నారో అంతా వింటున్నారు. అబద్ధాల పునాదుల మీద వాళ్ల ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. ఈ ఎన్నికలు ఎందుకు ముఖ్యమో, అవసరమో ప్రతీ ఒక్కరికీ మీరే చెప్పాలి. ‘‘కేవలం ఒక ఎమ్మెల్యే, ఎంపీనో ఎన్నుకునే ఎన్నిక కాదు. ఈ ఎన్నికలు ఈ రాష్ట్రంలో ఈ 57 నెలలుగా పేదలకు అందుతున్న సంక్షేమాన్ని నిర్ణయించే ఎన్నికలివి. ప్రతీ ఒక్కరికీ చెప్పాలని పార్టీ కేడర్‌కు సీఎం జగన్ సూచించారు.
ఆ అక్క చెల్లెమ్మలే మన స్టార్ క్యాంపెయినర్లు : రూ. 3 వేలు చేసిన పెన్షన్ 1వ తేదీ ఉదయాన్నే అందాలన్నా, ఇంటికే ఆ పెన్షన్ రావాలన్నా, భవిష్యత్ లో పెరగాలన్నా, ఇంటికే ఆ పెన్షన్ రావాలన్నా, మీ ఊరికే మీ ఇంటికే వైద్యం అందాలన్నా, వైద్యం కోసం ఏ పేదవాడూ అప్పులపాలు అయ్యే పరిస్థితి రాకూడదన్నా, అది మనందరి ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం మాత్రమే ఆ పని చేయగలదని ఇంటింటి వెళ్లి చెప్పండి. మన అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువులు, వైద్య సేవలు అందుకుంటున్న వారు ప్రతి ఇంట్లో నుంచి ఒకరు స్టార్ క్యాంపెయినర్లుగా రావాలని చెప్పండి. బయటకొచ్చి ప్రతి ఒక్కరూ కనీసం వంద మందితో జరుగుతున్న మంచి గురించి చెప్పాలన్నారు. అక్కా చెల్లెమ్మలకు అమ్మ ఒడి, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం కొనాగాసాలన్నా, సున్నా వడ్డీ రావాలన్నా, ఆసరా తప్పకుండా చెల్లించిన మీ అన్న ప్రభుత్వమే ఇవన్నీ చేయగలదని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. ఆ అక్కచెల్లెమ్మలే మన స్టార్ క్యాంపెయినర్లుగా బయటకు రావాలని చెప్పాలన్నారు.
57 నెలలో మీ బిడ్డ 124 సార్లు బటన్ నొక్కాడు : 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి మనం ప్రారంభించిన 22 లక్షల ఇళ్ల నిర్మాణంతోపాటు పేద అక్కచెల్లెమ్మలకు సొంతింటి కల నెరవేరాలన్నా, మహిళా సాధికారతకు ఏ మంచిజరగాలన్నా మీ అన్న ప్రభుత్వమే చేయగలదని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. స్టార్ క్యాంపెయినర్లుగా మారాలని చెప్పండి. గవర్నమెంట్ బడులు మారాలన్నా, ఇంగ్లీషు మీడియం చదువులు రావాలన్నా, ప్రతి క్లాస్ రూములో డిజిటల్ బోధనతో మొదలు ప్రతి పిల్లాడి చేతిలో ట్యాబులు రావాలన్నా, పెద్ద చదువులు 100 శాతం ఫీజు రీయింబర్ష్ మెంట్ ఇచ్చే విద్యా దీవెన, వసతి దీవెన ఇవ్వాలన్నా, అంతర్జాతీయ చదువులు అందాలన్నా మీ అన్న ప్రభుత్వం మాత్రమే చేయగలదని చెప్పాలన్నారు. పిల్లల తల్లిదండ్రులంతా మంచి చేస్తున్న మన ప్రభుత్వానికి అండగా ఉండాలని, 100 మందికి చెప్పాలని, మళ్లీ జగనన్ననే ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ప్రతి తల్లిదండ్రులకూ చెప్పండి. గ్రామాల్లో ప్రతి రైతన్నకూ చెప్పండి. రైతు భరోసా కొనసాగాలన్నా, ప్రతి రైతన్నకూ మెరుగైన ఆర్బీకే సేవలు అందాలన్నా, ఉచితంగా ఇన్సూరెన్స్ రావాలన్నా, సీజన్ ముగిసేలోపే ఆ రైతన్నకు ఇన్ పుట్ సబ్సిడీ దొరకాలన్నా, పగటిపూటే ఉచిత విద్యుత్, దళారీ వ్యవస్థ పోయి రైతన్నకు మద్దతు ధర అందాలన్నా కేవలం జగనన్న మాత్రమే చేయగలడు అని ప్రతి రైతన్నకూ వెళ్లి చెప్పండి. ప్రతి రైతన్న స్టార్ క్యాంపెయినర్ కావాలన్నారు. ఈ 57 నెలల్లో ఏకంగా మీ బిడ్డ 124 సార్లు ప్రజల కోసం మీ బిడ్డ బటన్ నొక్కాడు. ఏకంగా రూ.2.55 లక్షల కోట్లు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్లిపోవడం, లంచాలు లేవు, వివక్ష లేదు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మనందరి ప్రభుత్వం 2.55 లక్షల కోట్లు పేద కుటుంబాలకు పంపిందన్నారు. ఇంత మంచి చేసిన ప్రభుత్వానికి 2024 ఎన్నికల్లో ఆ ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ జగనన్న 124 సార్లు మనకోసం బటన్ నొక్కాడు, జగనన్న కోసం మనం కేవలం ఒక్కసారి, రెండు బటన్లు నొక్కలేమా అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పాలని కోరారు. జగనన్నకు ఓటు వేయకపోవడం అంటే ప్రతిపక్షాలకు ఓటు వేయడం అంటే దాని అర్థం, ఈ స్కీముల రద్దుకు మనమే ఆమోదం తెలిపినట్లవుతుందని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. ఈరోజు నెల 1వ తేదీన పొద్దున్నే చిరునవ్వుతో ప్రతి అవ్వాతాత, ప్రతి అన్న తమ్ముడు, చెల్లెమ్మకూ ఇంటి వద్దకే వచ్చి సేవలు అందుతున్నాయి. ప్రతిపక్షానికి ఓటు వేయడం అంటే దాని అర్థం మళ్లీ లంచాలు, మళ్లీ వివక్ష చూపించే జన్మభూమి కమిటీలను మళ్లీ బతికించినట్లవుతుందని, మన గ్రామంలో లంచాలు లేకుండా, వివక్ష లేకుండా ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ మనకు మంచి జరగాలి అంటే జగనన్నను మర్చిపోకూడదని విజ్ఞప్తి చేశారు.
చంద్రముఖి మళ్లీ నిద్రలేస్తుంది : 57 నెలల్లో మీ బిడ్డ మీ మంచి కోసం 124 సార్లు బటన్ నొక్కాడు. ఈ మంచి ఇలాగే జరగాలంటే నా కోసం రెండు బటన్లు నొక్కండి. ఒకటి ఎమ్మెల్యే ఎన్నికల కోసం. రెండోది పార్లమెంట్ ఎన్నికల కోసం. లేకుంటే గత ఎన్నికల్లో ఓటుతో మీరు పెట్టెలో బంధించిన చంద్రముఖి మళ్లీ నిద్రలేస్తుంది. సైకిల్ ఎక్కి టీ గ్లాస్ పట్టుకుని పేదల రక్తం తాగేందుకు ‘‘లక లక’’ అంటూ ప్రతీ ఇంటింటికి వస్తుంది. అబద్ధాలతో, మోసాలతో ఓ డ్రాక్యులా మాదిరి తలుపు తట్టి ప్రజల రక్తం తాగుతుంది. 2024 ఎన్నికల్లో జగనన్నకు ఓటేస్తే ఆ చంద్రముఖి బెడద ఇక మీకు శాశ్వతంగా ఉండదని, చంద్ర గ్రహణాలు ఉండవన్నారు. మరో 3 నెలల్లో మనందరి ప్రభుత్వం ఇంతకు మించిన ఉత్సాహంతో కొలువుదీరుతుందని చెబుతూ సెలవు తీసుకుంటున్నానని సీఎం జగన్ ప్రసంగం ముగించారు
వారంతా నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ : 14 ఏళ్లు సీఎంగా చేసినా కూడా చెప్పుకొనేందుకు ఏమీ లేదు కాబట్టి చంద్రబాబు రాజకీయం అంతా పొత్తులు, జిత్తులు, నక్కజిత్తులుగా సాగుతోంది. నేను ఇది చేశా నాకు ఓటేయండి అని అడగాల్సిన వ్యక్తి.. చెప్పుకొనేందుకు ఏదీ లేదు కాబట్టి పొత్తులు, జిత్తులు, నక్కజిత్తులతో సాగుతోంది. ఈ మధ్య ఈ చంద్రబాబుకి ఎన్టీరామారావు గుర్తుకొస్తున్నారు. వెన్నుపోటు పొడిచేదీ ఆయనే, మళ్లీ ఎన్నికలప్పుడు ఎన్టీఆర్ ను గుర్తు తెచ్చుకొనేదీ ఆయనే. ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా అంటున్నారు. ప్రజల్ని కాదు, పార్టీలను పిలుస్తున్నాడు. దత్తపుత్రుడిని పిలుస్తున్నాడు. నేనిచ్చే ప్యాకేజీ కోసం రా కదలిరా అని దత్తపుత్రుడిని పిలుస్తున్నాడు. వదినమ్మను పిలుస్తున్నాడు, కమలం పార్టీలో చేరి అక్కడ నా మనిషిగా రా కదలిరా అని వాళ్ల వదినమ్మను పిలుస్తున్నాడు. రాష్ట్రాన్ని అన్యాయంగా, అడ్డగోలుగా విడగొట్టిన రాష్ట్ర ద్రోహుల పార్టీని, వైయస్సార్ మరణం తర్వాత ఆయన పేరును అన్యాయంగా చార్జ్ షీట్ లో పెట్టిన నమ్మక ద్రోహుల పార్టీని నువ్వు కూడా రా కదలిరా అని చంద్రబాబు పిలుస్తున్నాడు. బాబుకు, దత్తపత్రుడికి, వదినమ్మకు, చంద్రబాబు బ్యాచ్‌కు., ఈస్టేట్ కు, వారికి సంబంధమే లేదు. ఏ ఒక్కరూ మన రాష్ట్రంలో ఉండరు. వారంతా నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్. వారికి ఏనాడైనా ప్రజలు ఎప్పుడు గుర్తుకొస్తారంటే, ఆ ప్రజలతో పని పడినప్పుడే. ఆయన సైకిల్ తొక్కడానికి ఇద్దర్ని, దాన్ని తోయటానికి మరో ఇద్దర్ని పొత్తులో తెచ్చుకొని రా కదలిరా అని పిలుస్తున్నాడు. చంద్రబాబుకు పొత్తే లేకపోతే కనీసం 175 చోట్ల ఎన్నికల్లో పోటీ చేసుకొనేందుకు అభ్యర్థులు కూడా లేరు.
ప్రజల్లోంచి పుట్టిన ప్రజల పార్టీ : ఇలాంటి దిగజారుడు పార్టీలన్నీ మీ జగనన్నే టార్గెట్ గా ఆయుధాలు రెడీ చేసుకుంటున్నాయి. పేదవాడి భవిష్యత్ టార్గెట్ గా, పేద వాడి సంక్షేమం టార్గెట్ గా ఆయుధాలు రెడీ చేసుకుంటున్నాయి.వీరితో యుద్ధానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా అని అడుగుతున్నా. ఈ యుద్ధం.. 15 ఏళ్లుగా నాకు అలవాటే. నాతో నడిచారు కాబట్టి మీకూ అలవాటే. ఇదీ ప్రజలకు ఇచ్చిన మాట మీద నిలబడిన ఈ ఒక్కడి మీద కలబడి వంద మంది వంద బాణాలు వేస్తున్నప్పుడు ప్రజలే రక్షణ కవచంగా ప్రజల్లోంచి పుట్టిన ప్రజల పార్టీ ఈ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఆ కనిపిస్తున్న జెండాకు అర్థం.. ఈ ఒక్కడి మీద దేశంలోకెల్లా బలమైన 10 వ్యవస్థల్ని ప్రయోగిస్తే ప్రజలు తమ భుజాన మోసిన ఎజెండా మన జెండా. వంద బాణాల్ని, కౌరవ సైన్యాన్ని ప్రజా క్షేత్రంలో మరోసారి ఎదుర్కొనేందుకు, మరో గొప్ప ప్రజా విజయాన్ని సాధించేందుకు మీరంతా సిద్ధమేనా అని అడుగుతున్నా. పార్టీని, మీ అన్నను అభిమానించే ప్రతి కార్యకర్త, నాయకుడికీ, అభిమానికీ, ప్రతి వాలంటీర్ కి, ఒక్క విషయం చెబుతున్నా, వీరితోపాటు ప్రజా ప్రతినిధులకు ఒక్కటే చెబుతున్నా. ఇది.. మీ అందరి పార్టీ. మీ జగన్ మీ బిడ్డ. మీ అందరికీ ఒక మంచి సేవకుడు. కార్యకర్తల్ని, నాయకుల్ని, అభిమానించే విషయంలో, వారికి పదవులు, అధికారం ఇచ్చే విషయంలో ఏ పార్టీ చేయని విధంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి డైరెక్టర్లను నియమించిన చరిత్ర మనది. నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి డైరెక్టర్లు, చైర్మన్లు పదవులు ఇవ్వడం ఇవన్నీ కేవలం మీ అన్నకు మాత్రమే సాధ్యం. గతంలో తెలుగుదేశం పార్టీ తమ కార్యకర్తలతో లంచాలు, పక్షపాతంతో కొద్దిమందికి మాత్రమే అన్న వివక్షతో జన్మభూమి కమిటీల ద్వారా సంక్షేమ పథకాల లబ్ధిదారులను ఎంపిక చేస్తే మనందరి ప్రభుత్వం మన చదువుకున్న పిల్లలతో తీసుకొచ్చిన మనదైన వాలంటీర్ వ్యవస్థ, ఇంటింటికీ వెళ్లి పని చేస్తున్న మన పార్టీకి దన్నుగా, ప్రజల మన్ననలు పొందుతూ మనతోపాటు పని చేస్తున్నారు. ఎవరూ గెలవనన్ని పదవులు, ఏ రాజకీయ పార్టీ ఇవ్వనన్ని అవకాశాలు ఇచ్చిన పార్టీ మన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్నారు.
175 ఎమ్మెల్యేలు మన టార్గెట్ : మంచి పాలన అందించాం. ప్రతి ఇంటికీ మంచి చేయగలిగాం. ఎక్కడా వివక్ష, లంచాలు లేకుండా గొప్ప పాలన ఇవ్వగలం అని చూపించాం. ఈరోజు నేను గర్వంగా చెబుతున్నా. ఇక్కడున్న ఎవరైనా ఏ పదవికైనా పోటీ చేయగలిగితే ఎప్పుడూ చూడని విధంగా గెలిపించే కార్యక్రమం జరుగుతుంది. భవిష్యత్ లో ఇంతకంటే గొప్పగా మన వారికి పదవులిచ్చే పార్టీ మనది. ఎంతో భవిష్యత్ ఉన్న పార్టీ. వ్యక్తిగతంగా ఒక్క విషయం చెబుతున్నా. పార్టీలో ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా ఉంటాం. ప్రజా సేవలో ఉన్న ప్రతి ఒక్కరికీ మీ అన్న, మీ తమ్ముడు సలహా ఇచ్చేది ఒక్కటే. గొప్పగా సేవ చేయండి. గొప్పగా మంచి చేయండి. మరో రెండు మెట్లు ఎక్కించే బాధ్యత నాదీ అని తెలియజేస్తున్నా. వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 175కు 175 ఎమ్మెల్యేలు మన టార్గెట్. 25 ఎంపీలకు 25 ఎంపీలు మన టార్గెట్. పరిపాలనలో మనం ఎక్కడా తగ్గలేదు. మనకు ఒక్క ఎంపీగానీ, ఒక్క ఎమ్మెల్యేగానీ తగ్గడానికి వీలే లేదు అని తెలియజేస్తున్నా. ఈ లక్ష్యాన్ని చేరుకొనేలా గడపగడపకూ వెళ్లి ప్రతి ఒక్కరితో ఓటు వేయించేందుకు మీరంతా కూడా సిద్ధమేనా?. సంక్షేమ పథకాల రద్దుకు జరిగే కుట్రల మీద యుద్ధానికి మీరంతా సిద్ధమేనా?. ఎన్నికల శంఖం మోగుతోంది. బాబు కుట్రలు, కుతంత్రాలను చిత్తు చేసేందుకు మనకున్న అస్త్రం.. మీ జేబులో ఉన్న మీ సెల్ ఫోన్. ఈ సెల్ ఫోన్ తో సోషల్ మీడియా పరంగా సిద్ధంగా ఉన్నారా? అని అందరినీ అడుగుతున్నా అన్నారు.