ఏపీ ఐకాస ఛైర్మన్ బండి శ్రీనివాసరావు
అమరావతి : రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం పోయిందని, వైసీపీ సర్కారు వచ్చిన తర్వాత డీఏ, పీఆర్సీ బకాయిలు తీసుకున్న దాఖలాలు లేవని ఏపీ ఐకాస ఛైర్మన్ బండి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఉద్యోగులు దాచుకున్న జీపీఎఫ్ డబ్బులను ప్రభుత్వం ఇవ్వకపోవడంతో తమ పిల్లల పెళ్లిళ్లు వాయిదా వేసుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో ఏపీ ఐకాస కార్యనిర్వాహక సమావేశం నిర్వహించారు. ఈనెల 14 నుంచి 26వరకు ఉద్యమం చేయాలని, అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే అవసరమైతే సమ్మెకు వెళ్లాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అనంతరం ప్రధాన కార్యదర్శి హృదయరాజు, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి శివారెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఒకటో తేదీన పెన్షన్, జీతం వస్తుందన్న గ్యారెంటీ లేదు. ప్రభుత్వ చర్యల కారణంగా ఈనెల 12న ప్రభుత్వానికి ఉద్యమ కార్యాచరణ నోటీసు ఇవ్వాలని నిర్ణయించాం. దీనికి ముందు 11న ఏపీ ఐకాస విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నారు.