వైద్య, విద్యా, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు బాధ్యతగా జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వ హించాలి : డా.జి. లక్ష్మీ శ
తిరుపతి : జిల్లాలో ఫిబ్రవరి 9న చేపట్టే జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ వైద్య ఆరోగ్యశాఖ తదితర సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమన్వయ సమావేశంలో కలెక్టర్ ఫిబ్రవరి 9న జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని పురస్కరించుకొని ప్రచార పోస్టర్లను తిరుపతి మునిసిపల్ కమిషనర్ అదితి సింగ్, తదితర అధికారులతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ అవగాహన పోస్టర్లను అన్ని గ్రామ సచివాలయం, విద్యా సంస్థలలో, వైద్య శాలల్లో ప్రదర్శించి బాలల లో అవగాహన కల్పించాలని కోరారు. చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం, శౌచాలయానికి వెళ్లి వచ్చాక చేతులను శుభ్రంగా కడుక్కోవడం ద్వారా, పరిశుభ్రతను పాటించడం ద్వారా నులిపురుగుల బారిన పడకుండా నివారించవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పిల్లలు, కిషోర బాలల కడుపులో నులి పురుగులు నిర్మూలించడానికి ఉచితంగా ఆల్బెండజోల్ 400 మిల్లీగ్రాముల చప్పరించే మాత్రలను 7వ తేదీ నాటికి సంబంధిత విద్యా సంస్థలకు అందేలా సరఫరా చేయాలన్నారు. సంబంధిత ఎంపిడిఓ, మునిసిపల్ కమీషనర్లు ఎన్డిడి యాప్ నందు ఎంత మందులు కావాలి అని నమోదు చేయాలనీ సూచించారు. డిఎంహెచ్ఓ పర్యవేక్షణ అధికారులకు విధులు కేటాయిస్తూ యాక్షన్ ప్లాన్ తయారు చేయాలనీ ఆదేశించారు. జిల్లాలో ఈ మందులు సుమారు 5.40 లక్షల వరకు అందుబాటులో బఫర్ తో కలిపి ఉన్నాయని తెలిపారు. ఈ మాత్రలను అన్ని మహిళా శిశు సంక్షేమ శాఖ అంగన్వాడీ కేంద్రాలకు, ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలు, కళాశాలలు, సంక్షేమ హాస్టళ్లు తదితర విద్యా సంస్థలకు ఉచితంగా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తద్వారా నులిపురుగుల సంక్రమణను సులభంగా నిర్మూలించ వచ్చునని పేర్కొన్నారు. 1-2 సం పిల్లలకు సగం మాత్ర, 2-19 సం పిల్లలకు 400ఎం జీ ఒక మాత్ర చప్పరిస్తూ మింగించాలని తెలిపారు. నులిపురుగులు ఉన్న పిల్లలు పోషకాహార లోపం, రక్తహీనత వల్ల నీరసంగా ఉంటారని, శారీరక మానసిక ఎదుగుదల లోపాలను కలిగి ఉంటారని అలాంటి వారందరికీ ఆల్బెండజోల్ చప్పరించే మాత్రలను తప్పనిసరిగా వేయించాలన్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్య అధికారులు, మండల పరిధిలో మండల విద్యా శాఖాధికారులు, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు పర్యవేక్షించాలని, సంబంధిత శాఖల జిల్లా అధికారులు ఈ కార్యక్రమం పకడ్బందీగా జరిగేలా చూడాలని తెలిపారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం రోజున డీ వార్మింగ్ చేయబడని పిల్లలకు మరలా ఫిబ్రవరి 16న మాప్ అప్ రోజున ఆల్బెండజోల్ మాత్రను చప్పరించి మింగేలా చర్యలు తీసుకోవాలని వైద్యశాఖ అధికారులతో కలెక్టర్ పేర్కొన్నారు. సమావేశానికి హాజరు కాని అధికారులకు నోటీస్ లు జారీ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్వో డాక్టర్ శ్రీహరి, అడిషనల్ డిఎంహెచ్ఓ అరుణ సులోచన, డిపిఎంఓ శ్రీనివాస రావు, జిల్లా సర్వైవలెన్స్ అధికారిని తెజేశ్వరి, రాష్ట్రీయ బాల్ స్వస్థ కార్యక్రమం ప్రాజెక్ట్ అధికారిని డాక్టర్ పద్మావతి, రుయా ఆస్పత్రి సూపరింటెండెంట్ రవిప్రభు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని జయలక్ష్మి, డిఈఓ వి.శేఖర్, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.