నిరసనలతో సభ జరగకుండా చేయాలనేదే ప్రతిపక్షాల కుట్ర
9 మంది టీడీపీ సభ్యులపై ఒకరోజు పాటు సస్పెన్షన్ వేటు
వెలగపూడి : ‘కాపీ’ కొట్టడమే తెలుగుదేశం పార్టీ కాపీ రైట్..పేటెంట్ రైట్ అని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శాసనసభలో అన్నారు. ‘బైబై బాబు’ నినాదాన్ని కాపీ కొట్టి ఇప్పుడు ఆందోళన చేస్తుండడమే అందుకు నిదర్శనమన్నారు. బుధవారం కరపత్రాలతో టీడీపీ నిర్వహించిన ఆందోళన కూడా కాపీయే అన్నారు. పక్క రాష్ట్రాల్లోని ప్రఖ్యాత పథకాలను తీసుకువచ్చి వాటిని కాపీ చేసి అమలు చేస్తామని టీడీపీ చెప్పడం కాపీకి పరాకాష్ఠ అన్నారు. కేవలం సభను జరగనీయకుండా చేయడమే లక్ష్యంగా విపక్షాలు ఆందోళన చేస్తుందన్నారు. పేపర్లు చింపి స్పీకర్ కు విసిరేసి, గట్టిగా అరిచి టీవీల్లో కనబడడం కోసమే మినహా ప్రజా సమస్యలపట్ల టీడీపీకి చిత్తశుద్ధిలేదన్నారు. ఆందోళన చేయడానికి ఇష్టపడని టీడీపీ సీనియర్ నాయకులను సైతం బలవంతం చేసి పోడియం దగ్గరకు లాగుతుండడం బాధాకరమన్నారు. ఉపముఖ్యమంత్రి, హోం మంత్రిగా గతంలో బాధ్యతలు నిర్వహించిన నిమ్మకాయల చినరాజప్ప, అనుభవజ్ఞులైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గణ వెంకటరెడ్డిలకు ఆందోళన చేయడం ఇష్టం లేకున్నా టీడీపీ ఆందోళనకు పురిగొల్పుతుందన్నారు. యావత్ రాష్ట్ర ప్రజలు ఎదురుచూసే బడ్జెట్ డే రోజు ఇలా ఆందోళన చేయడం, అడ్డుపడడం వల్ల సభకు అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో తగు చర్యలు చేపట్టాలని అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సూచన మేరకు టీడీపీ సభ్యులైన నందమూరి బాలకృష్ణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, వెంకటరెడ్డి నాయుడు, వెలగపూడి రామకృష్ణబాబు, నిమ్మల రామనాయుడు, రామరాజు, డోలా బాల వీరాంజనేయస్వామిలను ఒక్కరోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్టుగా స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు.