వెలగపూడి : రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ (ఏపీ భూమి హక్కు చట్టం)ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. 4 వారాల గడువు ఇచ్చినా ప్రభుత్వం కౌంటరు దాఖలు చేయలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వై.బాలాజీ కోర్టుకు తెలిపారు. కౌంటరు దాఖలుకు మరికొంత సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరగా ధర్మాసనం రెండు వారాల సమయం ఇచ్చింది. ఈలోగా అమలు చేసే అవకాశముందని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. అమలు చేస్తే అత్యవసర పిటిషన్ దాఖలు చేసేందుకు పిటిషనర్‌కు అవకాశం ఇస్తామని న్యాయస్థానం తెలిపింది. తదుపరి విచారణను ఉన్నత న్యాయస్థానం రెండు వారాలకు వాయిదా వేసింది.