విజయవాడ : రాష్ట్రంలో అత్యుత్తమ సేవలు, నైపుణ్యాలను అందించే అంశంపై రాష్ట్ర వైద్యవిద్య డైరెక్టర్ డాక్టర్ డివిఎస్ఎల్ నరసింహం, ఎకో ఇండియా (ఎక్స్టెన్షన్ ఫర్ కమ్యూనిటీ హెల్త్ కేర్ఔట్ కమ్) సంస్థతతో అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం మేరకు రాష్ట్రంలోని వైద్య విద్య డైరెక్టరేట్ పరిధిలో వున్న వైద్య, నర్సింగ్ కళాశాలలు, నర్సింగ్ స్కూళ్ళు, పారామెడికల్ సంస్థలు తమ సిబ్బంది, విద్యార్ధులకు వర్చువల్ పద్ధతిలో శిక్షణా కార్యక్రమాలను నిర్వహించేందుకు ఎకో ఇండియా వేదికను ఉపయోగించుకునేందుకు అవకాశమేర్పడింది. ఈ శిక్షణా కార్యక్రమాల కోసం డిసీజ్ స్పెసిఫిక్ క్లినిక్ మేనేజ్మెంట్, రిక్రూటింగ్ కమ్యూనిటీ పార్ట్నర్స్, ఐటి టూల్స్( హార్డ్వేర్, సాఫ్ట్వేర్), కర్రికులం రిసోర్సెస్, శిక్షణా పరికరాలు, ప్రోటోకాల్స్ విధానాలు, రిసెర్చ్ డిజైన్, ఎవాల్యుయేషన్ ప్రోసెసెస్, రిసోర్సెస్, టూల్స్ వంటి కార్యక్రమాలు, వసతులను ఎకో సంస్థ అందుబాటులో వుంచుతుంది. దీంతో పాటు ఆయా సంస్థల అవసరాల మేరకు ఇతర శిక్షణా కార్యక్రమాలకు కూడా ఎకో ఇండియా సంస్థ సహకరిస్తుంది. 12.02.2024వ తేదీ సోమవారం నాడు విజయవాడ ఓల్డ్ జిజిహెచ్ క్యాంపస్ లో ఉన్న డిఎంఇ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ మేరకు సంతకాలు చేసిన అవగాహనా పత్రాల్ని వైద్య విద్య డైరెక్టర్ డాక్టర్ డివిఎస్ఎల్ నరసింహం, ఎకో ఇండియా సంస్థ ప్రాజెక్ట్స్ విభాగం వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సందీప్ భల్లా పరస్పరం అందచేసుకున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో వైద్య విద్యా శాఖ (అకడమిక్) డైరెక్టర్ డాక్టర్ జి రఘునందన్, ఎకో ఇండియా సంస్థ ప్రాజెక్ట్స్ విభాగం డిప్యూటీ జనరల్ మేనేజర్ దీపాఝా తదితరులు పాల్గొన్నారు. ఎకో ఇండియా సంస్థ మన రాష్ట్రంతో పాటు గుజరాత్ రాష్ట్రం, జాతీయ ఆరోగ్య మిషన్తో కూడా అవగాహనా పత్రం కుదుర్చుకుంది. దీనితో పాటు హోమిబాబా క్యాన్సర్ హాస్పిటల్, వైజాగ్, టాటా మెమోరియల్ హాస్పిటల్, బొంబాయి వంటి సంస్థలు కూడా ఎకో ఇండియాతో అవగాహన కుదుర్చుకున్నాయి. ఈ సంస్థ తన శిక్షణా కార్యక్రమాలలో ప్రధానంగా వైద్యులు, నర్సులు, వైద్య విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థుల సామర్థ్య పెంపుపై దృష్టి సారిస్తుంది. ఉపన్యాసాలు, కేస్ చర్చలు, నైపుణ్య ప్రదర్శనలు, జాతీయ మరియు అంతర్జాతీయ రిసోర్స్ పర్సన్ల ద్వారా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు ఇ- లెర్నింగ్ ద్వారా ఎకో సంస్థ తన వేదిక నుండి అన్ని రకాల సాంకేతిక మద్దతును ఉచితంగా అందిస్తుంది.