నెల్లూరు : క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసి ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తెలిపారు. పొత్తుల విషయంలో పైస్థాయిలో నిర్ణయం ఉంటుందన్నారు. రాష్ట్రంలో నిరంకుశ, అవినీతి పాలన రాజ్యమేలుతోందని విమర్శించారు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని రకాల మాఫియాలు కొనసాగుతున్నాయి. ఇసుక అక్రమాలపై కోర్టు కూడా నిర్ణయం తీసుకోబోతోంది. గ్రామాల అభివృద్ధిలో ప్రభుత్వం పూర్తిగా విఫమైంది. అభివృద్ధి కుంటుపడింది. కేంద్రం నుంచి నిధులు వస్తున్నా దుర్వినియోగం చేశారు. తిరుపతిలో 35వేల దొంగ ఓట్లు నమోదు చేయించారు. మద్యం, ఇసుక మైనింగ్‌పై భాజపా పోరాటం కొనసాగుతుంది. పేదలకు ఇచ్చే ఇళ్ల విషయంలోనూ మోసం చేశారు. నిర్మాణం జరిగినా లబ్ధిదారులకు తాళాలు ఇవ్వడం లేదు. పనికిరాని పట్టాలను లబ్ధిదారులు చించేస్తున్నారు. కేంద్రం బటన్ నొక్కితే రైతులకు చేరుతుంది. రాష్ట్ర ప్రభుత్వం బటన్ నొక్కితే లబ్ధిదారులకు అందడం లేదు. ఈ విషయాలన్నీ గమనించి ప్రజలు ఎన్నికల్లో ఓట్లు వేయాలని పురందేశ్వరి సూచించారు.