విజయవాడ : ఛత్తీస్ ఘడ్ అంబాపురంలో కాంగ్రెస్ పార్టీ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని అందుకోసం చట్టాన్ని తీసుకొస్తామని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ సమన్వయకర్త కొప్పుల రాజు అన్నారు. ఇండియా కూటమి ప్రభుత్వం రాగానే లీగల్ గారంటీ అమలు చేస్తామని మద్దతు ధర ఉండేలా చట్టం తీసుకొస్తామని కొప్పుల రాజు అన్నారు. విజయవాడ ఆంధ్ర రత్న భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ ఇప్పుడు ఏదైతే నిరాకరిస్తున్నాడో దానిని అమలు చేస్తామని 2014 ఎన్నికల ముందు దేశ రైతాంగానికి హామీ ఇచ్చారని కొప్పుల రాజు అన్నారు. నిత్యావసర ధరలు మండుతున్నాయని, చరిత్రలో ఎన్నడూ లేనంత గరిష్ట స్థాయిలో నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. బిజెపి, నరేంద్ర మోడీ పదేపదే ఇచ్చిన హామీని నెరవేర్చకుండా మోసం చేశారనరు. ప్రభుత్వం చేసుకున్న ఈ తప్పులు, వైఫల్యాలు మీడియాలో ఎక్కడ హైలెట్ కాకుండా మెజరిటి మీడియాను గుప్పెట్లో పెట్టుకుందన్నారు. కొన్ని మీడియా సంస్థలు, వ్యక్తులు జర్నలిస్టులు, స్వతంత్రంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రశ్నిస్తుంటే వారిని ఇబ్బందులకు వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. అయితే ఇది ముగింపు దశకు చేరిందని, మరి కొన్ని నెలల్లోనే మోడీ ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడుతారన్నారని, కౌంట్ డౌన్ ఇప్పటికే మొదలైందని కొప్పుల రాజు తెలిపారు. ఆయనతోపాటు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ మెయప్పన్, వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి తదితరులు పాల్గొన్నారు.