ప్యాపిలి మండలంలో రాచర్లలో ఆర్థిక మంత్రి చేతుల మీదుగా రోడ్డు ప్రారంభం
జలదుర్గంలో కోటి రూపాయలతో నిర్మించిన షాదిఖానా ప్రారంభం
రూ.28 లక్షలతో ఏర్పాటు చేసిన గ్రంథాలయం ప్రారంభోత్సవం
రూ.2 కోట్లతో జలదుర్గం నుంచి డోన్ మధ్య మెరుగుపరచిన రహదారి వసతుల ప్రారంభోత్సవం
జలదుర్గం బహిరంగ సభలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
ప్యాపిలి : ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వరుస అభివృద్ధి ప్రారంభోత్సవాలతో బిజీబిజీగా గడిపారు. ప్యాపిలి మండలంలో ఆయన శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. రూ.34.80 కోట్లతో తీర్చిదిద్దిన గార్లదిన్నె-బూరుగల-కోన రోడ్డును 21 కి.మీ మేర రహదారిని మెరుగుపరచి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం జలదుర్గం గ్రామంలో రూ.3.28 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ముందుగా కోటి రూపాయలతో నిర్మించిన సరికొత్త షాదిఖానా భవనాన్ని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రారంభించారు. అనంతరం రూ.28 లక్షలతో నిర్మించిన శాఖ గ్రంథాలయ భవనానికి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన ప్రారంభోత్సవం చేశారు. షాదిఖానా ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కు జలదుర్గం ప్రజలు బ్రహ్మరథం పట్టారు. క్రేన్ సహాయంతో ఏర్పాటు చేసిన గజమాలతో ఆర్థిక మంత్రిని ఘనంగా సత్కరించారు. ఆ తర్వాత జలదుర్గం సెంటర్ లో రూ.2 కోట్లతో జలదుర్గం గ్రామం నుంచి డోన్ వరకు మెరుగుపరచిన రహదారి పనులకు సంబంధించిన పైలాన్ మంత్రి బుగ్గన ఆవిష్కరించారు.
టీడీపీ చెప్పే హామీలు ఎన్నికల స్టంట్..గెలవడం కోసమే పబ్లిసిటీ స్టంట్
బాదుడే బాదుడు కార్యక్రమం కోసం వచ్చి టీడీపీ అధినేత చంద్రబాబు జలదుర్గం గ్రామాన్ని మండలం చేస్తానని మోసపూరిత హామీలిచ్చారని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన విమర్శించారు. 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రజలకు ఏనాడు నెరవేర్చలేదన్నారు. అన్నేళ్లు రాజకీయంగా అండగా నిలిచిన కుప్పం ప్రాంతాన్ని రెవెన్యూ సబ్ డివిజన్ చేయకపోతే..ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పకుండానే కుప్పాన్ని సబ్ డివిజన్ చేసి చూపించారన్నారు. 7,8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ముఖ్యమంత్రిగా , ప్రతిపక్షనేతగా ఉండి కూడా చంద్రబాబు చేయలేని పనిని డోన్ నియోజకవర్గాన్ని ప్రభుత్వం రాగానే రెవెన్యూ డివిజన్ గా మార్చుకున్నామన్నారు. ఎన్నికల నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ల సబ్సిడీ, మహిళలకు ఉచిత ప్రయాణం, మహాలక్ష్మి పథకం పేరుతో ఆడపిల్ల పుట్టగానే రూ.25 వేలు ఇస్తానని గతంలో ఇచ్చిన హామీ ఒక్క ఆడపడచుకైనా అందిందా అని మంత్రి బుగ్గన ప్రశ్నించారు. బీపీఎల్ కుటుంబాలకు చెందిన ప్రతి అర్హుడికి 3 సెంట్ల స్థలం ఇళ్ల పట్టాలుగా ఇస్తానని దారుణంగా ప్రజలను మోసం చేశారన్నారు. స్వాతంత్ర్య సమరయోధులు, వికలాంగులు, విలేకర్లు సహా అందరికీ రాయితీలు తీసేయాలని మనసులో మాట పుస్తకంలో రాసుకున్న అక్షరాలు ప్రజలు మరచిపోలేదన్నారు. వంట గ్యాస్, నిత్యవసరాలు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పెంచిందని తెలుగుదేశం పార్టీ అమాయక మహిళలకు అసత్య ప్రచారం చేయడం ఆ పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. కులం, మతం చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ అమ్మఒడి, రైతు భరోసా, విద్యాదీవెన, వసతిదీవెనను అందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అన్యాయంగా విమర్శించి..ఇప్పుడు ఇంట్లో ముగ్గురికి ఇస్తామని కల్లబొల్లి కబుర్లు చెప్పి ఎన్నికల పబ్బం గడపాలని తెలుగుదేశం పార్టీ అడ్డగోలు హామీలిస్తుందన్నారు. ప్రజలు ఓటు హక్కును జాగ్రత్తగా వినియోగించుకోవాలన్నారు. అభివృద్ధి చేసిన వారికే ఓటేయాలని పిలుపునిచ్చారు. 2009 నుంచి 2014 కాలంలో టీడీపీ ఏం చేసింది, ఆ తర్వాత 2019 నుంచి 2024 వరకూ వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో పోల్చుకుని ఆలోచించాలన్నారు. అన్ని వర్గాలు సంతృప్తి చెందేలా సమగ్ర వసతులకు చిరునామాగా డోన్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినట్లు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. త్వరలోనే ప్యాపిలి మండలానికి తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కరిస్తామని మంత్రి పునరుద్ఘాటించారు.
రూ.351 కోట్లతో గోరుకల్లు రిజర్వాయర్ నుంచి 60 కి.మీ పైన పైప్ లైన్ ద్వారా నీరు తెచ్చి బేతంచెర్ల బుగ్గానిపల్లెలో నీటిని శుద్ధి చేసి ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీరిస్తామని మంత్రి స్పష్టం చేశారు. బృహత్ కార్యాలు, మహా యజ్ఞాలు చేసేపుడు కూడా కొన్ని ఇబ్బందులు, ఆటంకాలు రావడం సహజమని, అవేవి శాశ్వతం కాదని ప్రజలకు త్వరలోనే మంచిరోజులు వస్తాయన్నారు. బనగానపల్లె, ప్యాపిలి, డోన్, పత్తికొండ లాంటి పట్టణాలకు వెళ్లడానికి గమ్యాన్ని రహదారులు తీర్చిదిద్ది చేరువ చేశామన్నారు. రూ.37 కోట్లతో 100 పడకల ఆస్పత్రి, ప్యాపిలిలో వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజ్, కొత్తగా మంజూరైన రెండు పాలిటెక్నిక్ హార్టి కల్చర్ కాలేజ్ లు, గొర్రెల పెంపకం దారులకు శిక్షణ కేంద్రం సహా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి కాదా? అని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రతిపక్షాలను ప్రశ్నించారు. జలదుర్గం నుంచి నేరేడు చర్ల వరకూ త్వరలోనే రహదారి వేస్తామని మంత్రి బుగ్గన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మీట్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీరాములు, ప్యాపిలి మండల వ్యవసాయ సలహా కమిటీ ఛైర్మన్ మెట్పల్లి వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ దిలీప్ చక్రవర్తి, జలదుర్గం సర్పంచ్ దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.