ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్థన్ డిమాండ్
రాప్తాడులో ఫోటో జర్నలిస్టుపై దాడికి నిరసనగా ప్రెస్ క్లబ్ వద్ద నిరసన
ధర్నా చౌక్ వరకు ర్యాలీ నిందితులపై చర్యలకు డిమాండ్
విజయవాడ : జర్నలిస్టులపై దాడులను అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్థన్ డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం గాంధీనగర్ లోని ప్రెస్ క్లబ్ వద్ద విజయవాడ యూనిట్ ఆధ్వర్యాన రాప్తాడు లో ఫోటో జర్నలిస్ట్ పై జరిగిన దాడిని ఖండిస్తూ నిరసన ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్ మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడులు చేసే విధానాన్ని మాఫియా ముఠాలు, ప్రజా ప్రతినిధులు వదులుకోవాలని డిమాండ్ చేశారు. అలా కాని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాప్తాడు ఘటనపై డీజీపీ నిందితులను తక్షణమే అరెస్టు చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. యూనియన్ సీనియర్ నాయకులు ఎస్కే బాబు మాట్లాడుతూ చత్తీస్గడ్ ప్రభుత్వం తెచ్చిన విధంగా జర్నలిస్టులపై దాడుల నివారణకు ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉందా ?లేక నియంత ప్రభుత్వం సాగుతుందా అని ఆయన ప్రశ్నించారు. ఈ నిరసన కార్యక్రమంలో యూనియన్ అర్బన్ అధ్యక్షుడు చావా రవి, ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు కంచల జయరాజు, దాసరి నాగరాజు, సామ్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్. రమణారెడ్డి, ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర నేతలు విజయ భాస్కర్, నారాయణ , సాంబశివరావు, ఏపీయూడబ్ల్యూజే, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దారం వెంకటేశ్వరరావు, సామ్నా నగర అధ్యక్ష, కార్యదర్శులు ఎంవి సుబ్బారావు, ఎస్. గంగరాజు, ఆంధ్రజ్యోతి బ్యూరో ప్రతినిధులు రామారావు, మృత్యుంజయ కుమార్ , ఉదయ భాస్కర్, పూర్ణ, హైదరాబాద్ కి చెందిన సీనియర్ జర్నలిస్ట్ పివి రమణ రావు, తదితరులు పాల్గొన్నారు.