నల్గొండ బైపాస్ రోడ్డు నిర్మాణానికి రూ.700 కోట్ల రూపాయలు మంజూరీ చేసిన కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరికి కృతజ్జతలు తెలియజేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. బైపాస్ నిర్మాణం వల్ల నల్గొండ పట్టణం అద్భుతంగా అభివృద్ధిని సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నల్గొండ ప్రజలకు ప్రమాదాలు, ట్రాఫిక్ వంటి ఇబ్బందులు తొలిగిపోతాయని మంత్రి తెలియజేశారు. ఇవ్వాల బంజరాహిల్స్ లోని మంత్రుల నివాస సముదాయంలో మీడియాతో మాట్లాడిన మంత్రి నిన్నటి ఢిల్లీ పర్యటన వివరాలను తెలియజేశారు. ఆనాడు డా. వై.యస్. రాజశేఖర్ రెడ్డి హైదరాబాద్ కు గేమ్ ఛేంజర్ గా ఔటర్ రింగ్ రోడ్డునున తీసుకువచ్చాడని.. దాంతో హైదారాబాద్ లో ఎయిర్ పోర్ట్, సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీలు అభివృద్ధి చెందాయని.. తాము రీజినల్ రింగ్ రోడ్డును నిర్మించి హైదరాబాద్ కు సూపర్ గేమ్ ఛేంజర్ గా మారుస్తున్నామని వివరించారు.
నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారితో కలసి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన జాతీయ రహదారుల గురించి ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారిని కలిసి విన్నవించడం జరిగిందని ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలియజేశారు. అడిగిన 16 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చాలనే వినతిపై నితిన్ గడ్కరి సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రగతిని మార్చే ఈ 16 జాతీయ రహదారుల గురించి దాదాపు గంటన్నరపాటు చర్చించి రాష్ట్ర అవసరాలను వివరించామని తెలిపారు. అందుకు వారు స్పందించి తక్షణం అనుమతులు మంజూరీ చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఇవే కాకుండా సిఆర్ఐఎఫ్ కింద మరో రూ.855 కోట్ల రూపాయలను మంజూరీ అయ్యేలా ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు.
దేశంలో లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నప్పటికి కేసిఆర్ ప్రభుత్వం కేంద్రంతో పేచీలు పెట్టుకొని జాతీయ రహదారులు రాకుండా చేసిందని.. కానీ నిన్న నితిన్ గడ్కరీ గారితో మాట్లాడినప్పుడు వారు చాలా సానుకూలంగా స్పందించారని మంత్రి తెలిపారు. తాను ప్రతిపక్ష ఎంపీగా ఉన్నప్పటికి ఆనాడు గడ్కరీ గారు ఎల్బీనగర్-మల్కాపూర్ కు రహదారికి ఆరు వందల కోట్లు, గౌరెల్లి భద్రచాలానికి మూడు వందల కోట్లు మంజూరీ చేశారని. ప్రజల అవసరాల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తే ప్రతిపక్షం, అధికారపక్షం అనేతేడా లేకుండా ఫలితం వస్తుందని ఆయన చెప్పారు. ఇప్పుడు ఆ పనులు నడుస్తున్నయని వివరించారు. ఈ 16 రహదారులను వెంటనే మంజూరీ చేస్తామని తెలిపినట్లు మంత్రి వివరించారు.
ఇక దశాబ్ధాలు గడిచినప్పటికి ఏ ముఖ్యమంత్రి మూసీ నది కాలుష్యాన్ని పట్టించుకోలేదని.. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మూసీ గతిని మార్చేందుకు నిరంతరం శ్రమిస్తున్నారని చెప్పారు. ఒకవైపు ప్రధాని నరేంద్రమోదీగారు గుజరాత్ లోని సబర్మాతీ నదిని 40 వేల కోట్లతో కాలుష్యాన్ని తొలగించి, సుందరీకరణ చేసి పర్యాటక ప్రాంతం చేస్తే.. మన గత ముఖ్యమంత్రి కాళేశ్వరం వంటి ప్రాజెక్టును కట్టి ప్రజాధనాన్ని దోచుకున్నాడని ఎద్దేవాచేశారు. గౌరవ ముఖ్యమంత్రిగారు కేంద్ర ప్రభుత్వ కృషితో మూసీ కాలుష్యాన్ని తొలగించి టూరిస్టు స్పాట్ గా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని.. ఖచ్చితంగా మూసీ కాలుష్యాన్ని తొలగించి పర్యాటక ప్రాంతంగా చేస్తామని మంత్రి తెలిపారు. రాబోయే మూడేళ్లలో రీజినల్ రింగ్ రోడ్డు పనులను పూర్తి చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నానని తేల్చిచెప్పారు.
గత ప్రభుత్వం నిర్వాకం వల్ల ఎప్పుడో పనులు జరగాల్సిన రీజినల్ రింగ్ రోడ్ పనులు ఆగిపోయాయని ఆయన ఆరోపించారు. లక్షల కోట్లు పెట్టి సాగునీటి ప్రాజెక్టులన్న గత ప్రభుత్వం రూ. 363.43 కోట్ల యుటిలీటీ చార్జీలను చెల్లించలేమని చేతులెత్తేసిందని ఆయన మండిపడ్డారు. దీంతో జాతీయ రహదారుల సంస్థ ఈ పనులను పెండింగ్ లో పెట్టిందని.. కానీ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే.. తాను రోడ్డు రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ముఖ్యమంత్రిగారితో మాట్లాడి రూ. 363.45 కోట్ల రూపాయలను చెల్లిస్తామని కేంద్రానికి లేఖ రాసి.. స్వయంగా ఢిల్లీకి వెళ్లి గడ్కరీతో, జాతీయ రహదారుల సంస్థ ఛైర్మన్ తో చర్చించి విషయాన్ని వివరించి పనులను తిరిగి గాఢిలో పెట్టామని చెప్పారు. మా నిజాయితీతో కూడిన ప్రభుత్వాన్ని గుర్తించిన నితిన్ గడ్కరి ఒక అడుగు ముందుకేసి మేమే యుటిలిటీ చెల్లిస్తామని చెప్పడం చాలా సంతోషం కలిగిచిందని మంత్రి వివరించారు.
ఈ సందర్భంగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి కామెంట్లపై విలేకరులు అడిగిన ప్రశ్నకు మంత్రి తీవ్రంగా స్పందించారు. కిషన్ రెడ్డి గారు చాలా భాధకరమైన స్టేట్మెంట్లు ఇస్తున్నారు. భువనగిరి గుట్టకు కేబుల్ కారు నిర్మాణానికి కేవలం రూ 200 కోట్లు స్వరాష్ట్రానికి కేటాయించకోలేని వ్యక్తి కాంగ్రెస్ ప్రభుత్వంపై అవాకులు చెవాకులు పేలడం ఏంటని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందన్న కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఘాటుగా స్పందించారు.. కాంగ్రెస్ పార్టీని టచ్ చేస్తే బీజేపీని రాష్ట్రంలో నామరూపాలు లేకుండా చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు ఉద్యమకారులని.. తమ ప్రభుత్వాన్ని ఎలా కాపాడుకోవాలో ప్రజలకు తెలుసని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాన్ని ఒక కేంద్రమంత్రి స్థాయిలో ఉండి కూలగొడతామని మాట్లాడం దారుణమని ఆక్షేపించారు. మూసి బాగుచేసేందుకు, రాష్ట్ర అభివృద్ధికి ఒక్క రూపాయి తీసుకురాలేని కిషన్ రెడ్డి. . కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలు చేయడం తగదన్నారు. రెండు నెలల కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్న బీజేపీ నాయకులు.. బ్లాక్ మనీని తీసుకువచ్చి ప్రతీ అకౌంట్లలో పది లక్షలేస్తమని, యేడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పిన ప్రధాని మాటల సంగతేంటని ప్రశ్నించారు. సరైన సమయంలో మరో రెండు హామీలను అమలు చేస్తామని తేల్చిచెప్పారు.
గత పదేండ్లలో కేసిఆర్ ప్రభుత్వం కాళేశ్వరం, పాలమూరు పేరుతో లక్షల కోట్ల అప్పులు చేసి దోచుకోవడం తప్పా.. తెలంగాణలో రోడ్లు, మౌళిక వసతుల కల్పన చేయలేదని కోమటిరెడ్డి ఆరోపించారు. గత ప్రభుత్వం టీహబ్, కేబుల్ బ్రిడ్జ్ తప్పా హైదరాబాద్ కు ఏం చేసిందని ప్రశ్నించారు. సింగపూర్ లాంటి దేశాలు వాడిన నీళ్లను త్రాగునీళ్లుగా వాడుకునే టెక్నాలజీని అభివృద్ధి చేస్తుంటే గత ప్రభుత్వం మాత్రం మూసీ నదిని వదిలేసిందని ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో మూసీ నది గురించి సీరియస్ గా పనిచేసిన ముఖ్యమంత్రి ఒక్క రేవంత్ రెడ్డి మాత్రమేనని ఆయన తేల్చిచెప్పారు.
బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర అభివృద్ధిని ఫణంగా పెట్టి కేసుల నుంచి బయటపడ్డారని ఎద్దేవా చేశారు. బయట ఫైటింగులు చేసుకొని లోపల మీటింగులు పెట్టుకొనే బీఆర్ఎస్ –బీజేపీ బంధం కేసిఆర్ ఢిల్లీ పర్యనటతో బట్టబయలు కాబోతుందని జోష్యం చెప్పారు. తన కొడుకును ఆశీర్వదించమని కేసిఆర్ మోదీ ముందు మోకరిల్లి బయట ప్రగల్భాలుపలుకుతున్నాడని మండిపడ్డారు. బీఆర్ఎస్ పని అయిపోతందని. అది ముగిసిన అధ్యాయని చెప్పారు.
మొన్నటిదాక ముందు సీట్లో కూర్చున్న కేటీఆర్.. నిన్నటి అసెంబ్లీలో మాత్రం నాకేం తెల్వదన్నట్టు వెనకసీట్లో కూర్చున్నాడని ఆరోపించారు. 299 టీఎంసీల నీళ్లకు ఒప్పుకున్న కేసిఆర్ నల్గొండకు పోయి ఏదేదో మాట్లాడారని మంత్రి ఆరోపించారు. కృష్ణానది నీళ్లను నిర్లక్ష్యం చేసిందే బీఆర్ఎస్ పార్టీ.. పదేండ్ల కాలంలో కనీసం 250 టీఎంసీల నీళ్లను వాడలేని కేసిఆర్ నల్గొండకు పోయి నోటికి వచ్చినట్లు ఆరోపణలు చేశాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసిఆర్ అనాలోచిత నిర్ణయాలతో ప్రస్తుతం నల్గొండ కు త్రాగునీళ్లకు కూడా కష్టంగా ఉందని.. ప్రజలకు తాగునీరు అందించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నమని చెప్పారు. ఎస్సెల్బీసీని, నల్గొండ ప్రాజెక్టలును నిర్లక్ష్యం చేసిన కేసిఆర్, హరీష్ రావు పదేండ్లలో పది కిలోమీటర్ల టన్నెల్ తవ్వకుండా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. జిల్లాలో ఒక్క కాలువ పనులు పూర్తి చేయని బీఆర్ఎస్ నాయకులు అబద్ధాలతో బ్రతుకుతున్నారని ఆయన ఆరోపించారు.
రాబోయే రోజుల్లో దక్షిణ తెలంగాణను సస్యశ్యామలం చేస్తామని. ఇచ్చిన ఆరుగ్యారెంటీలను అమలు చేస్తామని మంత్రి చెప్పారు.